భాగ్యనగరంలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

by M.Rajitha |
భాగ్యనగరంలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం మంగళవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తయింది. భక్త జన సందోహం ఓవైపు.. పిల్లల కేరింతలు మరోవైపు.. పీకలతో చెవుల్లో మార్మోగింతలు.. డప్పుల చప్పుళ్లు.. తీన్మార్ స్టెప్పులు.. భక్తికీర్తనలకు లయబద్ధంగా అడుగులు వేసే బృందాలు ముందుకు నడుస్తుండగా.. గణపతి బొప్పా మోరియా.. ఆదా లడ్డూ చోరియా.. జై బోలో గణేష్ కి జై.. జై జై గణనాథా.. బై బై గణనాథా అంటూ నవరాత్రులు పూజలందుకుంటున్న బొజ్జ గణపయ్యాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈనెల 7వ తేదిన ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి.

ఖైరతాబాద్ మహాగణపతి...

ఖైరతాబాద్‌ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్‌ నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్‌ భవన్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ చేరుకున్నాడు. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్‌ జనసంద్రంగా మారిపోయింది. గతపతి బప్పా మోరియా నినాదాలతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు మారుమ్రోగాయి. మధ్యాహ్నం 1.40గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం.4 వద్ద సూపర్ క్రేన్ తో ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం చేశారు. బాలాపూర్ గణేషుని నిమజ్జనం క్రేన్ నెం.12 వద్ద నిమజ్జనం చేశారు.

గ్రేటర్ లో 1,02,510 విగ్రహాలు..

గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు 1,02,510 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, ఐడీఎల్, మిరాలం చెరువు, మల్కాజ్ గిరి చెరువు ఇలా ప్రధాన చెరువులతోపాటు 73 బేబిపాండ్స్ లలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. అత్యధికంగా ఐడీఎల్ చెరువులో 25,456 విగ్రహాలను నిమజ్జనం చేశారు. రాజేంద్రనగర్ పత్తికుంటలో 7213, ఆల్వాల్ కొత్తచెరువులో 6221, ముషిరాబాద్ బండ్ లో 56452, పల్లె చెరువులో 4245, అత్యల్పంగా సంతోష్ నగర్ లోని బతుకమ్మబావిలో 40 విగ్రహాలను నిమజ్జనం చేశారు.

సాగర్ పరిసరాల్లో జనసందోహం...

గణేష్ నిమమజ్జనాల నేపథ్యంలో చూడటానికి నగరవాసులు భారీగా తరలి వచ్చారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండి పోయింది. కాగా హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బస్ సర్వీసులు, ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసులను ప్రత్యేకంగా నడుపుతున్న విషయం తెలిసిందే. మెట్రో మార్గాల గుండా హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకునే వారి సంఖ్య వేలల్లో ఉండటంతో.. నేడు అన్ని రూట్లలో మెట్రోలు కిక్కిరిసి పోయాయి. ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం చూడ్డానికి వచ్చిన యువకులు అక్కడే ఉన్న పాదచారుల వంతెన పైకెక్కి కూర్చున్నారు. పోలీసులు ఎంత చెప్పిన వినకపోవడంతో పోలీసులు తమ లాఠీలను ఝుళిపించాల్సి వచ్చిందని చెబుతున్నారు.

మెట్రోస్టేషన్ మూసివేత..ప్రయాణీకుల ఆగ్రహం....

భక్తుల రద్దీతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు మెట్రోరైలు ద్వారా తరలి వచ్చారు. రద్దీని కంట్రోల్ చేయలేకపోయిన మెట్రో అధికారులు మెట్రో స్టేషన్ గేట్లను మూసి వేశారు. ప్రతి పదినిముషాలకు ఒకసారి మాత్రమే గేట్లను ఓపెన్ చేసి, పరిమిత సంఖ్యలో ప్రయాణికులను లోపలికి వదిలారు. మెట్రో గేట్లు మూసివేయడంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు, మెట్రో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకునే అన్ని మార్గాల్లోని బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లలో కూడ తీవ్ర రద్దీ నెలకొంది.

మంత్రి, డీజీపీ ఏరియల్ సర్వే...

నగరంలో నిమజ్జనాన్ని పరిశీలించడానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ లతో మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్ హెలిక్యాప్టర్ ద్వారా మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరిగింది. ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల్లో డీజీపీ జితేందర్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ, హైదరాబాద్ నగరంలో చాపర్ ద్వారా గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నిమజ్జనాలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని, నగరంలో 25 వేల మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారని, నిమజ్జానాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సజావుగా జరిగిందని తెలిపారు. ఈ రోజు రాత్రి మొత్తం నిమజ్జనాలు జరుగుతాయని, బుధవారం కూడా చాలా చోట్ల జరిగే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేస్తామని, వర్కింగ్ డే కావడంతో ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా.. నిమజ్జనాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు రాత్రిలోగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయని వివరించారు. బుధవారం వర్కింగ్ డే కాబట్టి మంగళవారం రాత్రిలోపే నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed