చిక్కుల్లో ఇద్దరు మాజీ మంత్రులు.. ఆధారాలతో సహా బయటపెట్టాలని సర్కార్ ప్లాన్

by Gantepaka Srikanth |
చిక్కుల్లో ఇద్దరు మాజీ మంత్రులు.. ఆధారాలతో సహా బయటపెట్టాలని సర్కార్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పరివాహక ప్రాంతంలో ఇద్దరు మాజీ మంత్రులకు ఫంక్షన్ హాల్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తమకు ఉన్న పలుకుబడితో సదరు లీడర్లు మూసీ బఫర్ జోన్ ను ఆక్రమించి, ఫంక్షన్ హాల్స్ నిర్మించినట్లు పార్టీ వర్గాల్లో ఉన్న టాక్. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఆ ఫంక్షన్ హాల్స్ ను తొలగించక తప్పదనే చర్చ స్థానికంగా వినిపిస్తున్నది. అందుకే ప్రభుత్వం చేపడుతున్న పునరుజ్జీవ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారేమోనని అనుమానం గులాబీ పార్టీ కేడర్ లో నెలకొన్నది.

నాగోల్‌లో సువిశాలమైన ఫంక్షన్ హాల్స్

రెండోసారి పవర్‌లోకి వచ్చిన తరువాత గులాబీ పార్టీకి చెందిన ఇద్దరు లీడర్లు నాగోల్ ప్రాంతంలో మూసీ పక్కనే ఫంక్షన్ హాల్స్ నిర్మించారు. వీరిద్దరు కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేశారు. నిజానికి సదరు లీడర్ల మధ్య పెద్దగా వ్యాపార సంబంధాలు లేవు. కానీ అందులో ఒక లీడర్ కుమారుడికి మొదటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుభవం ఉంది. ఆ లీడర్ పుత్రుడు మూసీ దగ్గరలో ఉన్న సుమారు మూడున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సమాచారం. అప్పటికే ఆ భూమి బఫర్ జోన్ లో ఉందని అధికారులకు సమాచారం ఉంది. కానీ రూలింగ్ పార్టీ కావడంతో మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తున్నది. అయితే బఫర్ జోన్ లో ఉన్న భూమిని కొనుగోలు చేసి, పక్కనే ఉన్న మరికొంత భూమిని ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించినట్టు విమర్శలు ఉన్నాయి. ఆ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ప్రభుత్వ పరంగా సహకరించిన ఓ సీనియర్ గులాబీ లీడర్ కు ఆ ఫంక్షన్ హాల్ లో వాటా ఇచ్చినట్టు గులాబీ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. అలాగే ఆ చుట్టుపక్కల మరికొంత మంది బీఆర్ఎస్ లీడర్లకు ఫంక్షన్ హాల్స్ ఉన్నట్టు ప్రచారం ఉంది. అవన్ని కూడా మూసీ పునరుజ్జీవంలో కూల్చివేస్తారనే చర్చ స్థానికంగా జరుగుతున్నది.

ఆధారాలు సేకరించిన ప్రభుత్వం

మూసీ నది బఫర్ జోన్ లో బీఆర్ఎస్ లీడర్లకు చెందిన నిర్మాణాలపై ప్రభుత్వం ఆరా తీసినట్టు తెలిసింది. 2018 తరువాత నుంచే నాగోల్ నుంచి మొదలుకుని శాలిగౌరారం (భువనగిరి జిల్లా) వరకు మూసీకి ఇరువైపులా ఉన్న విలువైన భూములు గులాబీ లీడర్ల చేతుల్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. అక్కడ ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు ఏంటి? ఆ భూములు ఎవరు పేరు మీద ఉన్నాయి? ఏ ఏడాది అక్కడ నిర్మాణాలు చేపట్టారు? అనే వివరాలను ప్రభుత్వం సేకరించినట్టు సమాచారం. సమయం, సందర్భం చూసుకుని ఆ లిస్టును బహిర్గతం చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే నిర్మాణాల అనుమతుల కోసం రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఫైర్ డిపార్ట్ మెంట్స్‌కు సమర్పించిన దరఖాస్తులను విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed