నాగార్జున సాగర్ పంచాయితీ తెగేనా..?

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-07-31 07:49:58.0  )
నాగార్జున సాగర్ పంచాయితీ తెగేనా..?
X
    1. తెలంగాణ, ఏపీ మధ్య తరచూ నీటి వివాదం
    2. రాజకీయ స్వార్థం కోసమా..?
    3. ప్రజల ఇబ్బందులు తొలగించడం కోసమా..?
    4. ప్రస్తుతం కేంద్ర బలగాల పహారాలో డ్యామ్
    5. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య సన్నిహిత సంబంధాలు
    6. చంద్రబాబు, రేవంత్ చొరవ తీసుకునేనా..?

దిశ, నాగార్జునసాగర్: రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ఇటు తెలంగాణ.. అటు ఏపీ రాష్ట్రాలకు సాగు నీరందించడంతో పాటు తాగునీటి సమస్యను తీరుస్తోంది. అయితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి వినియోగం విషయంలో తరచూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తుతోంది. నిజానికి ఇరు రాష్ట్రాల పాలకులకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు రాజకీయం అంశంగా వినియోగించుకోవడంపై దృష్టి సారిస్తున్నారనే అంశం గతంలోనూ తేటతెల్లమయ్యింది. కానీ చిత్తశుద్ధితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు మాత్రం గత పాలకుల నుంచి ఇప్పటి పాలకుల వరకు చొరవ చూపడంలేదు. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. వీరి హయాంలోనైనా సాగర్ ప్రాజెక్టు వివాదానికి తెర పడుతుందా.? లేదా..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలావుంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్ర బలగాల పహారాలో ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు అర్ధరాత్రి సాగర్ డ్యామ్‌పై ఇరు రాష్ట్రాల భద్రతా బలగాల మధ్య పెద్ద హైడ్రామా నడిచింది. అప్పట్లో ఈ ఘటన రాజకీయంగా పెను దుమారం రేపింది. ఈ వ్యవహారం వెనుక మాజీ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్‌ల మధ్య రాజకీయ ఒప్పందం ప్రకారమే అర్ధరాత్రి హైడ్రామా నడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

తెలంగాణకు న్యాయం దక్కేనా..?

కృష్ణానదిపై ఉన్న కామన్ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు సంబంధించి తరచూ సాగర్ డ్యామ్ విషయంలోనే వివాదం జరుగుతోంది. నిజానికి ఈ వివాదం దశాబ్దాల తరబడి నుంచి వస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం.. తెలంగాణకు కేటాయించిన వాటా ప్రకారం నీళ్లను వినియోగించుకోవడంలో అన్యాయం జరుగుతోందనేది ఇక్కడి ప్రజల మాట. ఏపీ తనకు కేటాయించిన వాటాతో పాటు అదనంగా నీటిని తరలించుకుపోయిందని తెలంగాణ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. గత పదేండ్లు కేసీఆర్ అధికారంలో ఉండడం.. నాగార్జునసాగర్ డ్యామ్‌పై పెద్దగా దృష్టి పెట్టింది లేదు. ఎంతసేపటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప మరో ప్రాజెక్టును పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు గత ఐదేండ్లలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీళ్లను ఏకంగా కేసీఆర్ గాలికొదిలేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏపీ అధికారులు ఇష్టారాజ్యంగా సాగర్ నీటిని తరలించుకుపోయారు. ఆఖరికి టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేసుకుపోయిందనే విమర్శలున్నాయి. దీంతో ఉమ్మడి నల్లగొండతో పాటు హైదరాబాద్ జంట నగరాలు తాగునీటి కోసం అల్లాడిపోయాయి. మరోవైపు అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది.

అయితే ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం సైతం వీరి హయాంలో సద్దుమణిగితే.. తెలంగాణకు నీటి విషయంలో న్యాయం దక్కే అవకాశం కన్పిస్తోంది. అందులో భాగంగానే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు ఉన్న కామన్ ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలంను కృష్ణా నది యాజమాన్య సంస్థకు అప్పగించేది లేదంటూ తీర్మానం చేసింది. దీనికితోడు నాగార్జున సాగర్ వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని కూడా తీర్మానం పేర్కొంది. చేసేదేం లేక బీఆర్ఎస్ సైతం సదరు తీర్మానానికి మద్దతు తెలిపింది.

నవంబరులో ఏం జరిగిందంటే..?

కృష్ణానది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పట్నుంచో వివాదం ఉంది. కానీ తెలంగాణలో సెంటిమెంట్ అంశాన్ని వినియోగించుకోవాలన్న ప్రతిసారి నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఉద్రిక్తత నెలకొంటుంది. అందులో భాగంగానే 2023 నవంబర్ 29న తెలంగాణలో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సగ భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చూస్తుండగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ చూస్తోంది. అలాంటిది నాగార్జునసాగర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా పోలీసులను పంపించింది. పోలీసుల సాయంతో నీటిని విడుదల చేయించింది. ఈ సమయంలో 13వ గేటు వద్ద పోలీసులు కంచె వేశారు. కుడి కాలువ నుంచి దాదాపు 5,450 క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్ విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు గత ఐదేండ్లలో కాలంలో తరచూ జరగడం అందరికీ తెలిసిందే.

తెలంగాణకు 298.96 టీఎంసీలు.. దక్కేది మాత్రం అరకొరే..

కృష్ణా నదీజల వివాదాలపై 1969లో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ 1976 మే నెలో తుది తీర్పు వెలువరించింది. దీని ప్రకారం కృష్ణానది బేసిన్‌లో 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజారావు కమిటీ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు వేర్వేరుగా నీటి కేటాయింపులపై ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. 298.96 టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా 512.04 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. కాగా విభజన తరువాత కూడా నీటి వ్యవహారాలకు సంబంధించి ఇవే కేటాయింపులు కొనసాగుతూ వచ్చాయి. ఈ విషయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.‘‘కృష్ణా నది నీటి పంపిణీలో గతంలో వివక్ష జరిగింది. క్యాచ్ మెంట్ ఏరియా, కరవు ప్రాంతాలు, బేసిన్ జనాభా, సాగు విస్తీర్ణం ఆధారంగా నీటి పంపిణీ జరగాలి. తెలంగాణ హక్కుల కోసం, నీటి వాటా కోసం పోరాడతాం’’ అని అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా బచావత్ ట్రిబ్యునల్ లెక్కించిన నికర జలాల ఆధారంగా అప్పట్లో కేటాయింపులు జరిగాయన్నారు నీటిపారుదలరంగ నిపుణులు. ఈ కేటాయింపులు మార్చాలం టే మళ్లీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచే జరగాలన్నారు. గతంలో బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్యాచ్ మెంట్ ఏరియాను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అప్పుడే తెలంగాణకు నీటి కేటాయింపులు న్యాయంగా జరిగేవన్నారు.

సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద..

ప్రస్తుతం కృష్ణానది ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద పొటెత్తింది. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు క్రమంగా వచ్చి చేరుతోంది. మరికొద్దిరోజులు వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి ఆశించిన మేర నీటిమట్టం చేరుతుంది. ఈ నేపథ్యంలో నీటి కేటాయింపుల విషయంలో ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ చేతుల్లో పెట్టడం కంటే.. రాష్ట్రాల చేతుల్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాగూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను ఏపీ ప్రభుత్వం చూస్తుండడం వల్ల.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడమే సముచిత న్యాయం. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేంద్ర బలగాల చేతుల్లోంచి తీసుకుని ఎస్పీఎఫ్‌కు అప్పగించాల్సిన అవసరం ఉంది.

కేంద్ర దళాల ఆధీనంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు..

సాగర్‌ ప్రధాన డ్యాంపై ఎడమ వైపున తెలంగాణ సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, కుడి వైపున ఏపీ సీఆర్‌పీఎఫ్‌ బలగాల భద్రత కొనసాగుతోంది. కంట్రోల్‌ రూం వద్ద కూడా సీఆర్‌పీఎఫ్‌ బలగాలే పహారా కాస్తున్నాయి. ఎస్పీఎఫ్‌ బలగాలు కేవలం ఎడమ ఎర్త్‌ డ్యాం, గ్యాలరీలు, ఎడమ కాల్వ, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed