25 నెలల్లో ప్రాఫిట్ డబుల్ అంటూ బురిడీ.. ‘రియల్’, చిట్‌ఫండ్స్ కంపెనీల వినూత్న దందా

by Rajesh |
25 నెలల్లో ప్రాఫిట్ డబుల్ అంటూ బురిడీ.. ‘రియల్’, చిట్‌ఫండ్స్ కంపెనీల వినూత్న దందా
X

దిశ, తెలంగాణ బ్యూరో: పలు రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్స్ కంపెనీలు వినూత్న దందాకు తెరలేపాయి. ‘రూ.లక్ష పెట్టుబడి పెట్టండి. ప్రతినెలా రూ.9వేల వంతున 25 నెలలు ఇచ్చేస్తాం. 25 నెలల్లోనే డబుల్ అమౌంట్ వస్తుంది. లక్ష నుంచి మా కంపెనీల్లో ఎంతవరకైనా పెట్టుబడి పెట్టచ్చు. లక్ష బయట వడ్డీ ఇస్తే నెలకు రూ.2లకు మించి రాదు. 20 నెలల్లో రూ.40 వేలకు మించదు. కానీ.. మేము డబుల్ ఇస్తాం’ అంటూ కొందరు ఏజెంట్లు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్‌పైన బిజినెస్ చేస్తామని చెప్తున్న వీరికి.. ఆ స్థాయిలో వడ్డీ ఎలా వర్కవుట్ అవుతుందనేది అంతు చిక్కని ప్రశ్న. కానీ.. ఏకంగా రూ.4 వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపిస్తూనే ఉన్నారు. పైగా రూ.100 విలువైన బాండ్ పేపరు మీద పరస్పర అంగీకారపత్రం కూడా రాసిస్తున్నారు. ఇందుకు రూ.2 లక్షల విలువైన పోస్ట్ డేటెడ్ చెక్కులు కూడా ముందే ఇచ్చేస్తున్నారు. అయితే.. దాని వెనుకాల ఉన్న మతలబు తెలియక ప్రజలు పెట్టుబడులు పెడుతూ మోసపోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రజల పెట్టుబడితో బిజినెస్..

ఈ పెట్టుబడితో ఎల్‌జీ, సామ్‌సంగ్ కంపెనీ ప్రొడక్ట్స్, హోం అప్లయెన్సెస్ వ్యాపారం చేస్తామని ప్రజల వద్దకు వస్తున్న ఏజెంట్లు చెబుతున్నారు. రూ.లక్ష నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చని.. ఇలా ఇప్పటికే రూ.500 మందికి పైగా పెట్టుబడి పెట్టారని అంటున్నారు. ఇదే విషయాన్ని ఓ ఏజెంట్ ‘దిశ’కు వివరించారు. హైదరాబాద్‌ కేపీహెచ్ కాలనీ మెయిన్ రోడ్డులోనే ఈ తతంగం అంతా జరిగింది. వెల్ విజన్ ట్రేడర్స్ పేరిట వీరు పెద్ద వ్యాపారమే చేస్తున్నారు. సంగారెడ్డి, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టులను చూపించి పెట్టుబడుల రూపేణా కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో కంపెనీలు కొత్త తరహా ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టులను మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట దందాలు చేసి రూ.వేల కోట్లు ముంచేసి బోర్డులు తిప్పేశాయి. వేలాది మంది బాధితులు కేసులు పెట్టి పెట్టిన పెట్టుబడి వరకైనా వస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ బై బ్యాక్, అధిక వడ్డీ ఆశ చూపి లాగేస్తున్న రూ.వందల కోట్లకు బాధ్యులు.. బాధితులు ఎంత మంది అవుతారనేది తెలియకుండా ఉంది.

ఇన్వెస్ట్‌‌మెంట్ కాన్సెప్ట్

కొన్ని రియల్ సంస్థలు సైతం ఈ తరహా దందాకు తెరలేపాయి. సొంతంగా పెట్టకుండా జనం సొమ్ముతోనే వందల ఎకరాలు కొనుగోలు చేసి బిజినెస్ చేస్తున్నాయి. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ అనుభవంతో అవే కంపెనీలు కస్టమర్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ అపార్చునిటీ కాన్సెప్ట్ అంటూ కొత్త వ్యాపారానికి తెర తీశారు. ‘మా ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే ముందే కొంత ల్యాండ్ మీ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తాం. ఏడాది, రెండేండ్లలోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ల్యాండ్‌ని ప్లాట్ రూపంలో అందజేస్తాం’ అంటూ ఊరిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.50 లక్షలకు ఎకరం ఉంటే రూ.కోటికి పైగా లెక్కించి కస్టమర్లకు అంటగడుతున్నారు. ఇలాంటి బిజినెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అత్యధికం ఫైనాన్స్ సంస్థలే కావడం విశేషం. సుదీర్ఘ అనుభవం కలిగిన అనేక కంపెనీలు ఈ దందాను జోరుగా నడిపిస్తున్నాయి. ఆ ల్యాండ్‌ని రైతుల నుంచి కొనుగోలు చేయకుండానే మార్కెటింగ్ చేస్తుండడం గమనార్హం. అయితే.. ముందే ఇన్వెస్ట్ చేస్తే ప్రాజెక్టు పూర్తయ్యాక పెట్టుబడిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదనేది వాస్తవం.

కంపెనీల ప్రచారం

– ప్రకాష్ గ్రూప్ సస్టెయినబుల్ ఫ్యూచర్.. ఉయ్ డెలివర్ అనే కంపెనీ ‘రూ.20 లక్షలు ఇన్వెస్ట్ చేయండి. 15 నెలల్లోనే రూ.30 లక్షలు పొందండి. దీనికి రెండు గుంటల భూమిని సెక్యురిటీగా ఇస్తాం. ముంబాయి హైవేలో రుద్రారం దగ్గర మాకు వెంచర్ ఉంది’ అంటూ ప్రచారం చేస్తోంది. హెచ్ఎండీఏ, టీఎస్ రెరా అనుమతులు ఉన్నాయని బ్రోచర్‌లో చూపించారు. కానీ వివరాలు చెప్పడం లేదు. నాందేడ్ హైవేలో రూ.14 లక్షల నుంచి రూ.35 లక్షల పెట్టుబడి పెట్టొచ్చు. ప్రతినెలా రిటర్న్స్ వచ్చేస్తాయంటున్నారు. అది కూడా నెలకు రూ.35 వేల నుంచి రూ.87,500 వరకు 24 నెలలపాటు ఇస్తామంటున్నారు.

– ఆర్ఎస్ డెవలపర్స్ అనే కంపెనీ.. ‘రూ.40 లక్షలు ఇన్వెస్ట్ చేయండి. 15 నెలల్లో రూ.60 లక్షలు ఇచ్చేస్తాం. దానికి 4 గుంటల భూమిని సెక్యురిటీగా ఇస్తామంటూ ప్రచారం సాగిస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో సర్వే నం.62, 65 నుంచి 70, 73 నుంచి 82, 83 పార్ట్, 93, 94 ల్లో 38.13 ఎకరాల్లో లే అవుట్ వేశారు. 504 ప్లాట్లు చేసినట్లు లే అవుట్ చూపిస్తున్నది. కానీ.. హెచ్ఎండీఏ/డీటీసీపీ, రెరా అనుమతులు మాత్రం పేర్కొనలేదు. అయితే ఐసీఐసీఐ, టాటా క్యాపిటల్ నుంచి లోన్లు కూడా ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. ఆ వెంచర్‌కి సురద్రు అని పేరు పెట్టారు. మరి అనుమతులు లేకుండా ఎలా అమ్మేస్తున్నారో కంపెనీ వాళ్లే క్లారిటీ ఇవ్వాలి.

Advertisement

Next Story

Most Viewed