Formula E-car racing : కారు పార్టీ నేతలకు ఫార్ములా ఈ- కార్ రేసింగ్ డేంజర్ సిగ్నల్స్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-06 10:44:55.0  )
Formula E-car racing : కారు పార్టీ నేతలకు ఫార్ములా ఈ- కార్ రేసింగ్ డేంజర్ సిగ్నల్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఫార్ములా ఈ-కార్ రేసింగ్(Formula E-car racing) స్కామ్ విచారణలో ఏసీబీ(ACB) దూకుడు పెంచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై విచారణను ముమ్మరం చేస్తు్న్న ఏసీబీ రెండు మూడు రోజుల్లో కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు నోటీస్ లు ఇచ్చి వారిని విచారించేందుకు ఏసీబీ అడుగులేస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫార్ములా- ఈ రేసింగ్ కు సంబంధించి రూ. 55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తంచింది. మున్సిపల్ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆయా విదేశీ సంస్థలు, ప్రతినిధులకు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ భావిస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎమ్ఐయూడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అరవింద్ కుమార్ సమక్షంలోనే ఫార్ముల ఈ కార్ రేసింగ్ కోసం విదేశీ సంస్థలకు నిధులు దారి మళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎస్, ఆర్థిక శాఖల అనుమతులు లేకుండా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్ ఆదేశాలతోనే ఈ కార్ రేసింగ్ నిర్వాహణ సంస్థకు 55కోట్లు విడుదల చేసినట్లుగా అరవింద్ కుమార్ నోట్ ఫైల్ రాసినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉంది. కాగా ఈ స్కామ్ లో ఐఏఎస్ అరవింద్ కుమార్ సహా పలువురు మున్సిపల్ శాఖ అధికారులకు నోటీసులిచ్చేందుకు లీగల్ ఒపినీయన్ తో ఏసీబీ సిద్ధమైంది. అటు అరవింద్ కుమార్ ను విచారించేందుకు సీఎస్ శాంతికుమారి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, విచారణలో అధికారులు ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా మాజీ మంత్రికి ఏసీబీ నోటీసులిచ్చి విచారించనున్నదని సమాచారం. కేటీఆర్ టార్గెట్ గానే ఫార్ములా ఈ కార్ రేసింగ్ విచారణ సాగుతోందన్న ప్రచారం వినిపిస్తోంది.

గత ఏడాది ఫిబ్రవరి-11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల రేసింగ్ నిర్వహించారు. సీజన్‌-9 ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్‌ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150కోట్లు, హైదరాబాద్‌ రేసింగ్‌ లిమిటెడ్‌ రూ.30 కోట్లు ఖర్చుచేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. ఇది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి (సెషన్‌-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్‌(ఎఫ్‌ఈవో)తో ఎంఏయూడీ 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది. ఈ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండి.. ఖర్చంతా ప్రైవేటు సంస్థలైన గ్రీన్ కో, ఫార్ములా-ఈనే భరించాల్సి ఉంది. కానీ.. గత సీజన్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్ కో సంస్థను తొలగించి దానిస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా సీనియర్‌ ఐఏఎస్‌ అరవిందకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. అరవింద కుమార్ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే ఈవెంట్‌ నిర్వహణకు హెచ్‌ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారు.

అనంతర ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్‌ రేస్‌ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఎఫ్‌ఈవో ప్రకటించింది. అనంతరం ‘సెషన్‌-10’ రద్దయింది. ఫిబ్రవరి 10న ఈవెంట్‌ జరిగి ఉంటే హెచ్‌ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఆరోపించారు. ఇంతలోనే అక్రమ చెల్లింపుల విషయం బయటపడడంతో ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఫార్ములా-ఈ రేసుపై చట్టవిరుద్ధంగా నిర్ణయం తీసుకున్న అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు కూడా జారీ చేశారు. గతేడాది ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణకు విదేశీ కంపెనీలకు రూ.55 కోట్లు చెల్లించారని మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేయగా, ఈ స్కామ్ పై ఏసీబీ విచారణ చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed