BRS పార్టీ పేరు మార్పుపై మాజీ MP వినోద్ సెన్సేషనల్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2024-07-07 16:51:04.0  )
BRS పార్టీ పేరు మార్పుపై మాజీ MP వినోద్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి తెలంగాణతో పేగు బంధం తెంచుకున్నామని షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ పేరు మార్పులో నేను కూడా పాత్రధారినేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పవర్లో లేకపోవచ్చు కానీ పవర్‌ ఫుల్ పార్టీ అని అన్నారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌తో మాట్లాడి తెలంగాణ అంశంతో బీఆర్ఎస్‌కు ముడి విడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామని పేర్కొన్నారు. కాగా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్.. 2022 అక్టోబర్ 5న టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా పేరు మార్చిన విషయం తెలిసిందే. పార్టీ పేరు మార్పు అనంతరం తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను విస్తరించిన కేసీఆర్.. ఆ రాష్ట్రంలో పబ్లిక్ మీటింగ్స్ సైతం నిర్వహించారు. అయితే, గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు బ్రేక్ పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి పార్టీ పేరు మార్పు కూడా ఒక కారణమని స్వయంగా ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానించారు. పార్టీ పేరు మార్పుతో తెలంగాణతో బంధం తెగిపోయిందని, దీంతో బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మాజీ ఎంపీ వినోద్ బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై పై విధంగా కామెంట్స్ చేయడం గులాబీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మళ్లీ బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మారుస్తారా అని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed