మగ పోలీసుతో మహిళను విచారించడమేంటి?.. షాద్‌నగర్‌ ఘటనపై మాజీ మంత్రి సీరియస్

by Gantepaka Srikanth |
మగ పోలీసుతో మహిళను విచారించడమేంటి?.. షాద్‌నగర్‌ ఘటనపై మాజీ మంత్రి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు భయం గుపిట్లో బతుకుతున్నారని తెలిపారు. కేసీఆర్ హయంలో తెలంగాణ మహిళలకు సురక్షిత ప్రాంతంగా ఉండేదన్నారు. శాంతి భద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉండేదని గుర్తుచేశారు. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా మారిపోయిందని విమర్శించారు. షాద్ నగర్‌లో దళిత మహిళను పోలీసులు హింసించిన తీరు చాలా దారుణమని మండిపడ్డారు.

దళిత మహిళను బట్టలు విప్పి కొట్టే పరిస్థితికి తెలంగాణ చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. అసలు ఒక మగ పోలీసుతో మహిళను విచారించడం ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నేరాల రేటు 9 శాతం పెరిగిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నారు.. దీనికి ఏం సమాధానం చెబుతారు. అసలు సీఎం శాంతి భద్రతలపై సమీక్ష చేయడం లేదా? అని అడిగారు. సీఎంకు సమయం లేకపోతే హోంశాఖ భాద్యతలు వేరే వారికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. షాద్‌నగర్ ఘటనలో సీఐని సస్పెండ్ చేసినంత మాత్రాన దళిత మహిళకు న్యాయం జరగదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Next Story