‘తెలంగాణను కాపాడండి’.. రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ

by Gantepaka Srikanth |
‘తెలంగాణను కాపాడండి’.. రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా కాదు.. అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన నడుస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నదని సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరంకుశ పాలనకు బుల్డోజర్ ప్రతీకగా మారిందని అన్నారు. అది తెలంగాణలో పౌరహక్కులను నిరంతరం ధిక్కరిస్తోందని తెలిపారు. హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని అన్నారు. ఏళ్లుగా అన్ని చట్టపరమైన పత్రాలతో నివసిస్తున్న వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తూ బుల్‌డోజర్ పాలన నడుపుతున్నారని పేర్కొన్నారు.

‘బుల్డోజర్ విధానం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వానికి ప్రతిరూపంగా మారింది. అడుగడుగునా చట్టాలను తుంగలో తొక్కుతూ, సహజ న్యాయ సూత్రాలను కాంగ్రెస్ కాలరాస్తోంది. బుల్డోజర్లు 100 ఏళ్ల క్రితం నుంచి ఇళ్లను, కార్యాలయాలను, రహదారులను మరియు ఇతర నిర్మాణాలను నిర్మించడానికి ఉపయోగించారు. కానీ ఇప్పుడు జాతీయ పార్టీలైన బిజేపీ, కాంగ్రెస్‌లు నిర్మాణాలను కూల్చేందుకు ఉపయోగించడం దుర్మార్గం. యూపీ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పేదలు, మధ్య తరగతిపై బీజేపీ బుల్డోజర్లను ఎలా ఉపయోగించిందో, కాంగ్రెస్ కూడా తెలంగాణలో అదే విధంగా ఉపయోగిస్తున్నది. ఈ విషయంలో బిజేపీ దారిలోనే కాంగ్రెస్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మిమ్మల్ని ఈ లేఖ ద్వారా కోరుతున్నాను’ అని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed