విస్తీర్ణంలోనే కాదు.. కల్తీలోనూ పెద్ద జిల్లానే

by Rani Yarlagadda |
విస్తీర్ణంలోనే కాదు.. కల్తీలోనూ పెద్ద జిల్లానే
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: జిల్లాలో కల్తీ పదార్థాల విక్రయం యథేచ్ఛగా సాగుతున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ హోటళ్లు, టిఫిన్​ సెంటర్లు, మాంసం, చికెన్, చేపల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ కేంద్రాల్లో విక్రయించే ఆహార పదార్థాలు తాజాగా ఉన్నాయా..? ఎన్ని రోజులుగా నిల్వ పెడుతున్నారు? అదేవిధంగా ఆహార పదార్థాల్లో ఉపయోగించే వస్తువులు కల్తీలేవని నిర్ధారించాల్సిన అధికారులే బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారు. రోజు రోజుకు కుప్పలు కుప్పలుగా రోడ్లపై, ఫుట్​పాత్లపై, రెసార్టెంట్ హోటళ్లు, తదితర పేర్లతో ఫుడ్ కోర్టులు ఏర్పడుతున్నాయి. ఈ ఫుడ్​ కోర్టుల్లో తినే ఆహారం నాణ్యతతో లేకపోవడంతో వాంతులు, విరేచనాలు తదితర వాటితో అనారోగ్యం, విషజ్వరాల బారినపడుతున్నారు. దీనిని అరికట్టాలంటే ఆహార భద్రత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపినప్పుడే సాధ్యమవుతుంది. లేకపోతే ఫుడ్​కోర్టులు నిర్వహించే యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరించే అవకాశం ఉంది.

నామమాత్రపు తనిఖీలే..

రోజుకు ఎక్కడో ఒకచోట తనిఖీలు చేసి విధులు నిర్వహిస్తున్నట్లు ఫుడ్​ఇన్​స్పెక్టర్​ చెప్పుకోవడం అలవాటైపోయింది. ఈ ఏడాది కాలంలోనే 80కి పైగా నమూనాలు సేకరించి తనిఖీలు చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ నమూనాలన్నీ పెద్ద పెద్ద హెటళ్లలో తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. తుక్కుగూడ, తుర్కయంజాల్, బడంగ్‌పేట్, మీర్​పేట్, పెద్ద అంబర్​పేట్, బండ్లగూడ జాగీర్, మణికొండ, నార్సింగ్​ మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లలో ఉపయోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. కానీ ఎవరిపై కేసులు నమోదు చేశారు..? చర్యలు ఏమి తీసుకున్నారు? అనే విషయాలను వెల్లడించడంలో అధికారులు విఫలమయ్యారు. కల్తీ వ్యాపారులు చేసే ఆగడాలను అడ్డుకోవడంలో సంబంధిత అధికారులు పనిచేయడం లేదని తెలుస్తోంది. తనిఖీలు జరిపితే తప్పుచేసే కల్తీ వ్యాపారుల గుండెల్లో భయం పుట్టాలి. ఆ స్థాయిలో పనిచేసేందుకు ఆహార భద్రత అధికారులు, సిబ్బంది లేరు. కానీ ఉన్న అధికారులు చేసినా కేసుల తీవ్రతను వివరించే ప్రయత్నం చేయకపోవడం విడ్డూరంగా ఉంది.

పేరుకే కలెక్టరేట్‌లో కార్యాలయం..

జిల్లా కలెక్టరేట్‌లో ఆహార పరిరక్షణ, భద్రత కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలో కేవలం ఓ జూనియర్​అసిస్టెంట్​స్థాయి ఉద్యోగి మాత్రమే ఉంటుంది. ఆ ఉద్యోగికి ఆహార పదార్థాల తనిఖీపై కనీస అవగాహన లేదు. ఏ సమాచారం చెప్పాలన్నా.. ఫుడ్​ ఇన్‌స్పెక్టర్​ పేరుతో ఉన్న జిల్లా అధికారితో మాట్లాడాలని వివరిస్తుంది. ఫోన్​నంబర్​ తీసుకొని ఆ అధికారితో ఎన్ని సార్లు మాట్లాడే ప్రయత్నం చేసినా స్పందించకపోవడం గమనార్హం. జిల్లాలో 11 ఉద్యోగాలు ఆహార భద్రత శాఖకు మంజూరు ఉండగా.. కేవలం ఏడుగురితో వ్యవస్థను నడుపుతున్నారు. ఉన్న ఏడుగురిలో ఇద్దరు ఇతర జిల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లాకు ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతమున్న ఉద్యోగాలతో తనిఖీ ప్రక్రియ నడిచే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ దుస్థితిని అడ్డుపెట్టుకొని ఉన్నతాధికారులు, సిబ్బంది ఆసరాగా చేసుకొని కాలయాపన చేస్తున్నారు.

ఆహార కల్తీలపై నిఘా పెట్టాలి..

రంగారెడ్డి జిల్లాలోని అర్బన్​ ప్రాంతం రోజు రోజుకూ పెరుగుతున్నది. ఈ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్​కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకొని తినుబండారాలు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు కల్తీ ఆహారం తినడంతో అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ విషయాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు. పెరుగుతున్న కల్తీ ఆహార పదార్థాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకుంటే కల్తీలను నివారించే అవకాశం ఉంది.

Advertisement

Next Story