కోట్లు కొల్లగొట్టిన నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్లు అరెస్ట్

by GSrikanth |   ( Updated:2023-02-16 10:21:44.0  )
కోట్లు కొల్లగొట్టిన నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్లు అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: భారీగా డబ్బు వచ్చేలా చేస్తామని ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్లను నమ్మించి కోట్లు కొల్లగొట్టిన గ్యాంగ్‌లోని ఐదుగురిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు, 14 సిమ్ కార్డులు, 1 లాప్టాప్, 1 హార్డ్ డిస్క్, 1 ఎస్ఎస్డీ కార్డు, లక్షా 50 వేల నగదు, 4 బ్యాంకు పాస్ బుక్కులు, డాకుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనర్ డీ.ఎస్. చౌహన్ వివరాల ప్రకారం.. నిందితులైన ముర్ షీద్ అన్సారీ, వికాస్ సింగ్‌తోపాటు వారి ఇంకో స్నేహితుడు గతంలో నకిలీ కాల్ సెంటర్‌లో పనిచేశారు.

అప్పుడే ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వారిని ఎలా మోసం చేయాలో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఘాజియాబాద్‌లో సొంతంగా కాల్ సెంటర్ పెట్టుకున్నారు. తరుణ్, మనీష్, లలితకుమార్‌ అనే ముగ్గురిని టెలీ కాలర్స్‌గా నియమించుకున్నారు. డబ్బు చెల్లించి ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నవారి వివరాలు సేకరించారు. వారికి ఫోన్లు చెయ్యటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే రాచకొండ పరిధిలో ఉంటున్న ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఫోన్ చేశారు. ఇప్పటికే మీరు తీసుకున్న పాలసీపై భారీ లబ్ది చేకూరుస్తామని నమ్మించారు. 2,4,5 కోట్ల రూపాయల నకిలీ డీడీల ఫోటోలు చూపించారు.

మరి కొందరిని పరిచయం చేయాలని అడిగారు. ఇది నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి 12 మంది బంధు మిత్రులను వారికి పరిచయం చేశాడు. ఇలా వీరిని ఉచ్చులోకి లాగిన నిందితులు కోట్ల రూపాయలు చేతికి అందాలంటే జీఎస్టీ కట్టాలని నమ్మించారు. ఇలా 2016 నుంచి 2022 వరకు సదరు రిటైర్డ్ ఉద్యోగితో పాటు అతను పరిచయం చేసిన వారి నుంచి దఫా దఫాలుగా రూ.కోటి 60 లక్షలు లాగాడు. ఈ విషయం తెలిసి బాధితుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం గ్యాంగ్‌లోని ఐదుగురిని ఘాజియాబాద్‌లో అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story