రైతు దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వానికి షాక్!

by GSrikanth |
రైతు దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వానికి షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దశాబ్ది ఉత్సవాల పేరుతో గ్రామాల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నలు బెడిసికొడుతున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయరంగంలో చేసిన అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను రైతు వేదికల కేంద్రం ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం గ్రామస్థాయిలో అధికారులు, సర్పంచ్‌లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గ్రామస్థులకు భోజనాలు ఏర్పాటు చేసి రైతు వేదికల వద్దకు రప్పించే ప్రయత్నాలు చేసింది.

అయితే రైతు సంక్షేమం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు నిలదీశారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా కొనుగోలు చేయకుండా ఈ సంబరాలేంటని రైతులు మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని స్వయంగా కేసీఆర్ చెప్పినా ఇప్పటివరకు అందలేదని, వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదని నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో రైతుల నుండి వ్యతిరేకత కనిపించింది. రైతుల నిలదీతతో ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు, బీఆర్ఎస్ నేతలు బిక్కమొఖాలు వేశారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీకి అదే రైతుల నుంచి వ్యతిరేకత రావడం ఇబ్బందికర పరిస్థితిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed