రాజకీయాలకు మాజీ మంత్రి మల్లారెడ్డి గుడ్ బై!.. ఆ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

by Prasad Jukanti |   ( Updated:2024-01-30 10:57:00.0  )
రాజకీయాలకు మాజీ మంత్రి మల్లారెడ్డి గుడ్ బై!.. ఆ వ్యాఖ్యలకు అర్థం అదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో:మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. తనకు 71 ఏళ్లు వచ్చాయని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానన్నారు. రాజకీయ పరంగా తనకు ఇవే చివరి ఐదేళ్లు అని, ఈ ఐదేళ్లలో మీ అందరికీ మంచిగా సేవ చేస్తానన్నారు. మంగళవారం శామీర్ పేట మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ సీఎంఆర్ కన్వెన్షన్ లో మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గ ప్రజలే తన బంధువులు అని ఇన్నాళ్లు నియోజకవర్గంలో అనేక పనులు చేశానని రాబోయేరోజుల్లో మరిన్ని చేస్తానన్నారు.

మంత్రి వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం?:

ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మల్లారెడ్డి ఆసక్తి చూపుతున్నారు. అధిష్టానం ఛాన్స్ ఇస్తే పోటీకి సై అంటూ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తాను పార్లమెంట్ కు వెళ్లడం ద్వారా ఎమ్మెల్యేగా ఖాళీ కాబోయే స్థానంలో తన కొడుకును గెలిపించుకుని రాజకీయంగా సెటిల్ చేయాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాను లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇవే తన చివరి ఎన్నికలు అని పరోక్షంగా పార్టీకి హింట్ ఇస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మల్లారెడ్డి వ్యూహం ఎలా ఉన్నా గులాబీ అధినేత కేసీఆర్ ఆలోచన ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Next Story