నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. 3 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

by Gantepaka Srikanth |
నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. 3 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు మరో బడా కంపెనీ ముందుకొచ్చింది. అమెరికా బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్(Amgen) హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగరంలోని హైటెక్ సిటీలో ఆరంతస్తుల భవనంలో ఏర్పాటయ్యే ఈ సెంటర్‌లో దాదాపు మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది చివరి నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికాలో ఆ కంపెనీ ప్రతినిధులతో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు.
ఈ కంపెనీ దాదాపు 100 దేశాల్లో విస్తరించి ఉండటం గమనార్హం. భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలో పేరొందిన బయోటెక్‌ సంస్థ హైదరాబాద్‌ను తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవటం గర్వించదగ్గ విషయమని అన్నారు. బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత ఇనుమడిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచస్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్పూర్తిదాయకంగా ఉందన్నారు. ఈ సెంటర్ ఏర్పాటు అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed