ఎంప్లాయీ ఫ్రెండ్లీ సర్కార్ :ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భరోసా

by M.Rajitha |   ( Updated:2024-09-04 17:17:46.0  )
ఎంప్లాయీ ఫ్రెండ్లీ సర్కార్ :ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భరోసా
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మాత్రమే కాదని ఎంప్లాయీ-ఫ్రెండ్లీ ప్రభుత్వం కూడా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు. ఉద్యోగుల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, ఎన్నిసార్లు సమావేశం కావడానికైనా, చర్చించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను కొలిక్కి తేవాలన్న ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉన్నదని నొక్కిచెప్పారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం సమావేశమైన సందర్భంగా పై భరోసా కల్పించారు. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమేనని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఎంప్లాయీస్ విషయంలోనూ అదే వైఖరితో ఉంటుందని స్పష్టత ఇచ్చారు.

తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ (టీజీఈజేఏసీ) ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సచివాలయంలో క‌లిసిన సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు స‌మ‌స్య‌లను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. టీజీఈజేఏసీ ఛైర్మ‌న్ మారం జ‌గ‌దీశ్వ‌ర్‌, సెక్రెట‌రీ ఏలూరి శ్రీపివాస‌నరావు, తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవరకొండ సైదులు ఇత‌ర ముఖ్య‌నాయ‌కులు 39 డిమాండ్ల‌ను ఆయ‌న ముందు ఉంచారు. గత ప్రభుత్వం నుంచీ పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల‌ను వెంటనే విడుద‌ల చేయాలని, పే రివిజ‌న్ క‌మిష‌న్ రిపోర్టును వెంట‌నే తెప్పించుకుని అమ‌లులో పెట్టాలని, ఉద్యోగుల‌కు 51% ఫిట్‌మెంట్‌ను అమ‌లు చేయాలని, ఉద్యోగుల‌కు హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఇప్పటివరకు ఈ-కుబేర్‌లో ఉన్న పెండింగ్ బిల్లుల‌ను వెంట‌ను క్లియ‌ర్ చేయాలని, భవిష్యత్తులో ఈ-కుబేర్ సిస్ట‌మ్‌ను ర‌ద్దు చేయాల‌ని, ఎన్నిక‌ల సంద‌ర్భంగా బ‌దిలీచేసిన ఉద్యోగుల‌ను తిరిగి పాత స్థానాల్లోకి పంపాలని, సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను ర‌ద్దు చేయాలని, జీవో 317 ద్వారా తలెతతిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. ఇలాంటి పలు అంశాలను డిప్యూటీ సీఎంకు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed