తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి : Supreme Court

by samatah |   ( Updated:2022-11-29 10:11:17.0  )
తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి : Supreme Court
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం జరుగుతున్నాయంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అభ్యర్థిత్వంపై టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. ఎన్నికల అఫిడవిట్‌లో రాజాసింగ్‌పై నమోదైన క్రిమినల్ కేసులు చూపలేదని..రాజాసింగ్‌ను అనర్హుడిగా ప్రకటించి నోటీసులు జారీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

రాజాసింగ్‌పై అనేక క్రిమినల్ కేసులున్నందున ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని, ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం మాత్రమే ఉందని పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'తెలంగాణలో జాతక చక్రాల ప్రకారం గ్రహాలన్నీ కలిసి ఈ కేసును వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ఆధారంగా జరుగుతున్నాయి' అంటూ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో గోషామహాల్ నుంచి పోటీ చేసినవారికి నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాగా, 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని న్యాయమూర్తి రామ సుబ్రమణ్యం గుర్తు చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ ధర్మాసనం వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed