Minister : మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు...

by Kalyani |
Minister : మూడు  నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు...
X

దిశ, అందోలుః కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలను నేరవేరుస్తూ… రెండు,మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌రాజనర్సింహ అన్నారు. ఎన్నికలు జరిపించాలన్న ఉద్దేశ్యంతో కుల గణనను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ ప్రక్రియను బీసీ కమిషన్‌కు అప్పగిస్తూ అదేశాలను జారీ చేసిందని ఆయన తెలిపారు. సోమవారం చౌటకూర్‌ మండలం తాడ్‌ దాన్‌ పల్లి చౌరస్తా వద్ద ఎంఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆలయ్‌–బలయ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరిని కలుస్తూ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. కుల గణనతో అన్ని కులాలకు సముచిత న్యాయం జరుగుతుందన్నారు.

కులాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని గుర్తించాలని, జనాభా ప్రతిపాదికన అన్ని కులాలకు వాటా కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణయంతో ప్రభుత్వం వన్‌ మ్యాన్‌ కమిషన్‌ ను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామాల్లో ఇండ్లు, స్థలాలు లేని పేదవారిని గుర్తించి, అర్హత కలిగిన ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీ చేసిందన్నారు. ఏడాదికోక జాబ్‌ క్యాలేండర్‌ను తప్పకుండా వేస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని, ఇప్పటికే 30 వేల ఉద్యోగాలను ఇచ్చామన్నారు.

కంకోల్, సింగితం, ఎల్లుపేట గ్రామాలలో రూ.2.45 కోట్లతో ప్రాథమిక హెల్త్‌ సెంటర్‌లు ప్రారంభం కాబోతున్నాయన్నారు. వట్‌పల్లిలో 50 పడకల ప్రభుత్వ అసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.14 కోట్లను మంజూరు చేసిందని, ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. జోగిపేటను వ్యాపార పరంగా అభివృద్ది పరిచేందుకు అజ్జమర్రి నుంచి జోగిపేట వరకు రోడ్డు నిర్మాణానికి రూ.80 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, రోడ్డు ఏర్పాటుకు భూసేకరణ జరుగుతుందన్నారు. బోరంచ ఎత్తిపోతల పనులను పూర్తి చేసి, రేగోడు పెద్ద చెరువును మార్చిలోగా నింపుతామన్నారు.

రూ.433 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

అందోలు నియోజకవర్గంలో రూ.433 కోట్ల అభివృద్ది పనులకు మరో10 రోజుల్లో శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి దామోదర్‌ ప్రకటించారు. రూ.168 కోట్లతో సింగూరు కాలువకు సిమెంట్‌ లైనింగ్, పుల్కల్‌ మండలం బస్వాపూర్‌ వద్ద 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ స్కూల్, రాయికోడ్‌లో రూ.15 కోట్లతో అత్యాధునిక గోదాం, బోరంచ ఎత్తిపోథల పథకానికి రూ.7 కోట్లు, అందోలు వద్ద 60 సీట్ల భర్తీతో నర్సింగ్‌ కళాశాలకు రూ.43 కోట్లు, 150 పడకల అసుపత్రికి రూ.60 కోట్లు, సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో జిల్లా సైన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.15 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ పనులకు మరో 10 రోజుల్లో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

రానున్న మూడు నెలలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కలిసి కట్టుగా ఉండి అభ్యర్థులను గెలిపించేందుకు కష్టపడాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గ్రామాల్లో ఇంటింటికి పర్యటించి ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి వచ్చే విధంగా ప్రొత్సహించాలన్నారు. వార్డు మెంబర్‌ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలను మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలన్నారు. పోటీలో నేనే ఉన్నా అనే భావన ప్రతి ఒక్కరిలో కలిగితే విజయం మనదేనన్నారు. మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టాలని, మన అభ్యర్థి విజయానికి పాటుపడాలన్నారు. ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని, కార్యకర్తలను విస్మరిస్తే పార్టీనే ఉండదని, నాయకత్వానికి అర్థం ఉండదన్నారు.

అందర్ని కలుస్తా...అర్జీలు తీసుకుంటా

అందోలు ప్రజలు చూపించిన ప్రేమానురాగాలు, ఆశీస్సులతోనే మా కుటుంబానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లోకి వెళ్లలేదని, త్వరలో ప్రతి గ్రామాన్ని పర్యటిస్తానని, మీ సమస్యల అర్జీలను తీసుకుంటానని, వాటిని పరిష్కరించే దిశగా ప్రణాళిక ఉంటుందని, మరోసారి మీ దీవెనలు తీసుకుంటానని ఆయన అన్నారు. గ్రామాల్లో శాంతి యుత వాతావరణం ఉండాలని, కక్షసాధింపులు ఉండవని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని మీకు సేవ చేయడమే నా ధర్మమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ ఫేడ్‌ డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, స్కోర్‌ మాజీ చైర్మన్‌ సంగమేశ్వర్, రాయికోడ్, జోగిపేట మార్కెట్‌ చైర్మన్‌లు సుధాకర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ డెవిడ్, కౌన్సిలర్‌లు ఎస్‌.సురేందర్‌గౌడ్, రంగ సురేష్, నాని నాగరాజ్, మండలాల పార్టీ అధ్యక్షులు శివరాజ్, దశరత్, శేషారెడ్డి, సతీష్, పీసీసీ సభ్యుడు కిషన్, మాజీ జడ్పీటీసీలు యాదగిరి, జాన య్య, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ యేసయ్య, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ టీసీ వెంకటేశం, మాజీ వార్డు మెంబర్ ప్రవీణ్, ఉద్యమ కారుడు పోలీస్ కృష్ణ, రేగోడు మండల పార్టీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, మాజీ కౌన్సిలర్ శరత్ బాబు, సీనియర్ నాయకులు సీహెచ్. మధు, కృష్ణ, రాజశేఖర్, నందు తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story