కవితకు ఈడీ నోటీసులు: రేవంత్ రెడ్డి మౌనమెందుకు?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-09 02:39:09.0  )
కవితకు ఈడీ నోటీసులు:  రేవంత్ రెడ్డి మౌనమెందుకు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడంపై అన్ని ప్రధాన పార్టీల నేతలు స్పందించారు. రకరకాలుగా కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మహేశ్‌కుమార్ గౌడ్, వీ.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు కామెంట్ చేశారు. కానీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం పాటించారు. ఈ మౌనం ఎందుకనే చర్చ సొంత పార్టీలోనే కాక విపక్షాల్లో సైతం చర్చకు దారితీసింది. హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రలో బిజీగా ఉన్న రేవంత్‌రెడ్డి కవిత విషయంలో మౌనంగా ఉండడం వెనక కారణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ కావడం ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారమన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒకే తాను ముక్కలని, రెండూ స్నేహ సంబంధాల్లో ఉన్న మెసేజ్ వెళ్ళకుండా ఉండేందుకు నోటీసుల డ్రామా మొదలైందన్నారు. ఈ రెండు పార్టీలూ కాంగ్రెస్‌ను పాపులర్ కాకుండా, ప్రజల్లోకి వెళ్ళకుండా చేసే కుట్రలో భాగమేనన్నారు. పొన్నం ప్రభాకర్ సైతం దీనిపై స్పందిస్తూ, మహిళా దినోత్సవం రోజున నోటీసులు జారీచేయడం బాధాకరమే అయినా దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయన్నారు. మరో నేత వీ.హనుమంతరావు సైతం మహిళా దినోత్సవం రోజున నోటీసులివ్వడం బాధ కలిగించిందన్నారు. విచారణకు పిలిచిన తర్వాత ఏం జరుగుతుందనేది ముఖ్యమన్నారు.

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సహా పలు పార్టీల నేతలు కవితకు ఈడీ నోటీసుల వ్యవహారంపై స్పందించారు. కానీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం పాటించడం చర్చకు దారితీసింది. గతంలో సైతం లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయం గురించి ఘాటుగా విమర్శలు చేయకుండా బ్యాలెన్సుగా వ్యవహరించారు. కవితకు సన్నిహితంగా ఉన్న సృజన్ రెడ్డి పేరు సైతం ఈ స్కామ్‌లో వినిపించిందని ఒక సందర్భంలో పాత్రికేయులు రేవంత్‌కు గుర్తుచేశారు. దివంగత కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డికి దగ్గరి బంధువైన సృజన్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గెలిచిన ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోవడంతో ఆయనతో తమకేం సంబంధం అంటూ రేవంత్‌రెడ్డి స్పందించకుండా దాటవేశారు.

ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ అయిన తర్వాత కూడా ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. తప్పు చేసి ఉంటే తన కుటుంబ సభ్యులపైనా చర్య తీసుకోండని వ్యతిరేకించనంటూ కామెంట్ చేశారు. కానీ కవిత విషయంలో మాత్రం తొలి నుంచీ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి :

కవిత జంతర్‌మంతర్ దీక్షకు హాజరయ్యేదెవరు?

Advertisement

Next Story