డా. ఏబీకే ప్రసాద్‌కు రాజారామ్మోహన్ రాయ్ అవార్డు

by Satheesh |   ( Updated:2023-02-08 12:27:41.0  )
డా. ఏబీకే ప్రసాద్‌కు రాజారామ్మోహన్ రాయ్ అవార్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు డాక్టర్ ఏబీకే ప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. జర్నలిజం రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గానూ ఏబీకే ప్రసాద్‌ ప్రతిష్టాత్మకమైన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని బుధవారం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా రఫీ మార్గ్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రధానోత్సవం జరగనుంది. ఈ అవార్డును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ ఏబీకేకు అందజేయనున్నారు. ఇదిలా ఉండగా ఏబీకే పూర్తి పేరు అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్. పాత్రికేయ రంగంలో 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తిగానూ ఏబీకే అరుదైన గౌరవం దక్కించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వెలువడిన ప్రధాన పత్రికలకు ఆయన సంపాదకులుగా పనిచేశారు. విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌గా తన జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించిన ఏబీకే ప్రసాద్ అక్కడ నుంచి అంచలంచలుగా ఎదిగి తెలుగులో ఆంధ్రపత్రిక, సాక్షి దాదాపు అన్ని పత్రికల్లోను పనిచేశారు. ఈనాడు, ఉదయం, వార్త పత్రికలను సంపాదకుడిగా లాంచ్ చేశారు. కొత్తగా దినపత్రిక ప్రారంభించాలనుకునే వాళ్ల తొలి ఛాయస్ ఏబీకే అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన తరచూ ఉద్యోగాలు మారే వారు. 2004-09 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షులుగా కూడా ఏబీకే పనిచేశారు. ఏది ఏమైనా తెలుగు పత్రికా రంగంలో ఏబీకేది ఎప్పటికీ చెరిగిపోని సంతకం అనడంలో సందేహం లేదు.

Advertisement

Next Story

Most Viewed