దేశవ్యాప్త ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్నాను : రాబర్ట్ వాద్రా

by M.Rajitha |
దేశవ్యాప్త ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్నాను : రాబర్ట్ వాద్రా
X

దిశ, వెబ్ డెస్క్ : తాను కేవలం ఆధ్యాత్మిక పర్యటన నిమిత్తమే హైదరాబాద్ వచ్చినట్టు రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా నేడు హైదరాబాద్ లో పర్యటించారు. తాను ఎలాంటి రాజకీయాల కోసం ఇక్కడికి రాలేదని, కేవలం ఆధ్యాత్మిక చింతనలతో దేశం మొత్తం పర్యటిస్తున్నానని, అందులో భాగంగానే ఈ నగరానికి వచ్చినట్టు తెలిపారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిని సందర్శించిన అనంతరం కాసేపు మీడియాతో ముచ్చటించారు. తాను ఇక్కడ రెండు రోజుల పాటు పలు ప్రార్థనా మందిరాలను దర్శించుకుంటానని తెలిపిన వాద్రా.. ప్రస్తుతం దేశంలో మహిళకు రక్షణ కరువైందని.. నా ఇంట్లో స్త్రీల భద్రత గురించి కూడా నాకు భయం వేస్తూ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి దాడులు ఆగడానికి ప్రభుత్వాలవైపు నుంచి ఆచరణ మాత్రమే కాక సమాజంలో మోరల్స్ కూడా అవసరమన్నారు. మగపిల్లలకు నైతికత నేర్పడం, బాధ్యతను అలవర్చడం ఇంట్లోనే మొదలుకావాలన్నారు. ఆడపిల్లలతో ఎలా వ్యవహరించాలో నేర్పడంతో పాటు కుటుంబంలోని మహిళల పట్ల చూపించే గౌరవాన్ని సమాజంలోని మహిళలందరి పట్లా ప్రదర్శించేలా తీర్చిదిద్దాలన్నారు. కంగనా రనౌత్ ఇంతకాలం సినీ నటిగానే ఉన్నా ఇప్పుడు బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నందున తన సినిమాల ద్వారా ఈ దేశ యువతకు మోరల్స్ అలవర్చే కథాంశాన్ని, ఇతివృత్తాన్ని ఎంచుకుని బాధ్యతను ప్రదర్శించాలని హితవు పలికారు. ‘ఎమర్జెన్సీ’ సినిమాలో ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తున్న కంగనా రనౌత్‌ ఇకనైనా మహిళల భద్రతపై అలాంటి సినిమాలు తీయాలని, మహిళా ఎంపీలంతా మహిళలకు ప్రభుత్వం తరఫున కల్పించాల్సిన భద్రత, సమాజంలో రావాల్సిన మార్పుపై మాట్లాడాలన్నారు.

కాంగ్రెస్‌లో మరో పవర్ సెంటర్ కాబోతున్నారా అని పాత్రికేయులు ప్రశ్నించగా, ప్రస్తుతం తన భార్య ప్రియాంక వయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారని, ఇప్పుడున్న మహిళా ఎంపీలకు ఆమె తోడవుతారన్న ధీమాను వ్యక్తం చేశారు. కానీ తాను మాత్రం ఇప్పుడే రాజకీయాల్లోకి రానని, ప్రజలు కోరుకుంటే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు. హర్యానా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈసారి ఆ మార్పు కాంగ్రెస్ విజయం దిశగా ఉంటుందన్నారు. మరో ఐదేండ్ల తర్వాత దేశంలోనూ ఆ మార్పు ఉంటుందన్నారు. రాహుల్‌గాంధీ, తాను కలిసినప్పుడల్లా దేశంలోని సమస్యల గురించే మాట్లాడుకుంటామన్నారు. యాధృచ్చికంగా ఇద్దరి ఆలోచనలూ ఒకేరకంగా ఉంటాయని, ఒకే కోణంలో చూస్తామన్నారు.



Next Story