డాక్టర్ పాశవికత్వం.. డబ్బులు కట్టలేదని కుట్లు విప్పేసిన దారుణం

by karthikeya |
డాక్టర్ పాశవికత్వం.. డబ్బులు కట్టలేదని కుట్లు విప్పేసిన దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి ఏ మాత్రం కనికరం లేకుండా కుట్లు విప్పేశారు. బాధితుడి కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. గాయాలతోనే సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.300 చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. రూ.1000 బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద క్యాష్ లేకపోవడంతో క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లిస్తానని అన్నాడు. కానీ దానికి ఆస్పత్రి సిబ్బంది అంగీకరించకపోగా నగదు చెల్లించాల్సిందేనని వాగ్వాదానికి దిగి, అతడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు.

అక్కడితో ఆగకుండా చివరికి పాశవికంగా రోగికి వేసిన కుట్లు విప్పేసి ఆస్పత్రి నుంచి బయటకు పంపించేశారు. కుట్లు విప్పందంటూ శ్రీను బాధతో విలవిల్లాడుతూ వేడుకున్నా ఆ ఆసుపత్రి సిబ్బంది మాత్రం క్రూరంగా డబ్బులు కడితే కుట్లు విప్పమని లేదంటే ఇలాగే ఉంటుందంటూ కుట్లు విప్పి బయటకు పంపించారు. దీంతో ఆసుపత్రి ఎదుటే బాధితుడు ఓ అరగంట పాటు తనకు వైద్యం చేయాలని వేడుకున్నా.. సిబ్బంది మాత్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత అతడి స్నేహితుల సాయంతో పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. ఈ ఘటనపై తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు.

Next Story

Most Viewed