కేబుళ్లు మీరు తొలగిస్తారా? మేం తొలగించాలా? : ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆగ్రహం

by M.Rajitha |
కేబుళ్లు మీరు తొలగిస్తారా? మేం తొలగించాలా? : ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరెంట్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను వెంటనే తొలగించాలని కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. కేబుళ్లు తొలగించేందుకు ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, గడువు కూడా దాటిపోయిందన్నారు. ఇప్పటికైనా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను తొలగిస్తారా? లేక తమనే తొలగించమంటారా? అంటూ శుక్రవారం ఒక ప్రకనటలో సీఎండీ హెచ్చరించారు. కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసుకున్న అనవసర కేబుల్స్, ఇతర వస్తువులు వెంటనే తొలగించాలని, లేదంటే సంస్థ పరంగా తగు చర్యలు తీసుకుంటామని ముషారఫ్ ఫరూఖీ వార్నింగ్ ఇచ్చారు.


విద్యుత్ స్తంభాలపై అడ్డదిడ్డంగా, ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించిన కేబుళ్లను తొలగించాలని జూలై 27, ఈనెల 7, 28 తేదీల్లో సమావేశాలు నిర్వహించి కేబుల్ సంస్థల, ఇంటర్నెట్ ప్రొవైడర్ల యాజమాన్యాలకు తెలియజేశామని ఆయన పేర్కరొన్నారు. ముఖ్యంగా ఈనెల 7న జరిగిన సమావేశంలో ప్రధాన రహదారుల్లో ఒక వారంలోగా, ఇతర ప్రధాన రహదారుల్లో గల విద్యుత్ స్తంభాలపై రెండు వారాల్లోగా నిబంధనల ప్రకారం కేబుళ్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలని ఆపరేటర్లను ఆదేశించామని ఆయన తెలిపారు. సమావేశాల్లో అంగీకరించి ఇప్పుడు తొలగించడంలో కొంత మంది కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు.


గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ స్తంభాలపై కెపాసిటీకి మించి కేబుళ్లు, కేబుల్ బండిల్స్, వివిధ ఆకారాల్లో వున్న టెలికాం పరికరాలు వేలాడదీసి ఉన్నాయని ఆయన చెప్పారు. సరైన పద్ధతిలో కేబుల్స్ ను అమర్చక పోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి విద్యుత్ ప్రమాదాలు సైతం జరిగాయన్నారు. విద్యుత్ పోళ్లపై అదనపు భారం పడి స్తంభాలు వంగిపోతున్నాయన్నారు. ఇంతేగాక కేబుల్స్ చిందరవందరగా ఫుట్ పాత్ లపై పడి ఉండటంతో బాటసారులకు ప్రమాదకరంగా మారాయన్నారు. కేబుల్, ఇంటర్నెట్ వినియోగదారులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశ్యంతో కేబుల్ సంస్థల, ఇంటర్నెట్ ప్రొవైడర్ల యాజమాన్యాలకు తగినంత సమయం ఇచ్చామని, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేబుల్ తొలగింపు ప్రక్రియ ప్రారంభించలేదని ముషారఫ్ ఫరూఖీ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమీక్షలో అంగీకరించినట్లుగా కేబుల్స్ తొలగింపు ప్రక్రియ పూర్తి చేయకుంటే విద్యుత్ సిబ్బందే స్వయంగా తొలగిస్తారని ఆయన హెచ్చరించారు.

Next Story

Most Viewed