డీఎంఈ కోర్టులో జిల్లా ఆసుపత్రి పంచాయితీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-18 06:23:54.0  )
డీఎంఈ కోర్టులో జిల్లా ఆసుపత్రి పంచాయితీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 1న బోధన్ మండలం ఆచన్ పల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లు చేసిన వైద్య సేవలపై సోమవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన టీం విచారించింది. ఈ నెల 1న జనరల్ ఆసుపత్రిలో వైద్యం కోసం చేరిన హన్మాండ్లును స్ట్రేచర్, వీల్ చైర్ కాకుండా కాళ్లతో లాగుతూ తీసుకెళ్లిన వ్యవహరం ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో రచ్చ అయిన విషయం తెల్సిందే. దానిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు ముగ్గురు ప్రొఫెసర్ల బృందం జీజీహెచ్‌లో సోమవారం విచారణ జరిపింది.

గత మార్చి 31న రాత్రి 10 గంటలకు వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రికి బోధన్ మండలం ఆచన్ పల్లికి చెందిన హన్మాండ్లు శ్వాస సంబంధిత సమస్యతో వచ్చారు. తల్లిదండ్రులతో సహా వచ్చిన హన్మాండ్లుకు 31న రాత్రి వైద్యం అందించలేదని సమాచారం. అయితే హన్మాండ్లు మద్యం సేవించాడని వైద్యం సహకరించకపోవడంతోనే ఏప్రిల్ 1న ఉదయం సైకాలజిస్టుకు చూయించాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 1న శనివారం ఉదయం 8 గంటలకు ఆసుపత్రిలో ఔట్ పేషెంట్‌గా నమోదు చేయించుకుని అప్పటి వరకు సిట్టింగ్ లాబీలో ఉన్న హన్మాండ్లును తల్లిదండ్రులు స్ట్రేచర్, వీల్ చైర్ అందుబాటులో లేకపోవడం ఉదయం వేళ సపోర్టింగ్ స్టాఫ్ రాకపోవడంతో వారే కాళ్లు పట్టి లాక్కెళ్లినట్లు వీడియోలో స్పష్టంగా ఉంది.

అయితే జిల్లా ఆసుపత్రి అధికారులు మాత్రం హన్మాండ్లు మద్యానికి బానిస అని అతడు వైద్యానికి సహకరించకపోవడంతో రాత్రి పరీక్షించి అతన్ని ఇన్ పేషెంట్‌గా చేర్చుకున్న విషయాన్ని కూడా ఎక్కడ తెలుపలేదు. ఆసుపత్రిలో 12 గంటల పాటు ఉన్న హన్మాండ్లును ఉదయం వేళ ఆసుపత్రిలో వైద్యం కోసం చూయించేందుకు కేర్ టేకర్ సిబ్బంది లేకపోవడంతోనే కాళ్లతో అతన్ని లిఫ్ట్ వరకు లాక్కెళ్లినట్లు స్పష్టమౌతుంది. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో రెండు వారాల తర్వాత రచ్చ కావడంతో జీజీహెచ్ అధికారులు మాత్రం తమ తప్పిదేమి లేదని, నిర్లక్ష్యంగా వైద్యం చేయలేదని వారికి వారే వివరణ ఇచ్చుకున్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు డీఎంఈ అధికారుల బృందం సోమవారం జీజీహెచ్‌లో సుమారు 6 గంటల పాటు విచారణ జరిపినట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న వైద్య సేవలతో పాటు వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆసుపత్రిలో వీడియో ఫుటేజిలను పరిశీలించారు. మార్చి 31న, ఏప్రిల్ 1న హన్మాండ్లుకు అందిన వైద్య సేవల గురించి ఆరా తీశారు. జిల్లా ఆసుపత్రిలో డీఎంఈ విచారణ కు వస్తే జీజీహెచ్ అధికారులు మాత్రం ఎన్ఎన్‌సీ అధికారులు తనిఖీలకు వస్తున్నారని తప్పుదోవ పట్టించడం విశేషం. అధికారులు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ డీఎంఈ ఆదేశాల మేరకే విచారణ జరిపామని, అక్కడ తుది నివేదిక సమర్పిస్తామని తెలిపారు. డీఎంఈ ఆదేశాల మేరకే ఆసుపత్రిలో రోగికి నిర్లక్ష్య వైద్యం అందించిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Advertisement

Next Story