కంటోన్మెంట్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు.. MLA అభ్యర్థి వంశ తిలక్ తీరుపై కేడర్ నారాజ్..!

by Disha Web Desk 19 |
కంటోన్మెంట్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు.. MLA అభ్యర్థి వంశ తిలక్ తీరుపై కేడర్ నారాజ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు ప్రచారంలో దూకుడు మీద ఉన్నాయి. కానీ కాషాయ పార్టీ మాత్రం అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. కీలకమైన కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ బీజేపీ ముఖ్య నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ వంశ తిలక్ వ్యవహార శైలితో విసిగిపోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు స్థానికంగా ఉంటూ ఎన్నికల ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తుంటే.. వంశ తిలక్ మాత్రం మాసాబ్ ట్యాంక్‌లోని విజయనగర్ కాలనీ నుంచే తమ కార్యకలపాలను నడిపిస్తుండడం మింగుడు పడడంలేదు. వంశ తిలక్ వ్యవహార శైలితో కొందరు ముఖ్య నాయకులు నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

పోటీ ఇక్కడ.. వ్యవహారం అక్కడ

బీజేపీ అభ్యర్థికి కంటోన్మెంట్‌లో ఇల్లు లేదు. కనీసం కార్యాలయం కూడా ఓపెన్ చేయలేదు. పల్లవి విద్యా సంస్థల అధినేత, బీజేపీ నాయకులు మల్కా కోమురయ్యకు చెందిన కార్యాలయాన్ని తాత్కలికంగా వంశ తిలక్ వాడుకుంటున్నారు. అయితే ఆ కార్యాలయానికి ఏదైనా అవసరం నిమిత్తం వెళ్లినా.. ఎవరూ అందుబాటులో ఉండడంలేదని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి అవసరానికి మాసాబ్ ట్యాంక్‌లోని తన నివాసానికి రావాలని చెబుతున్నారని, మేము ప్రతి రోజు ట్రాఫిక్ పద్మవ్యుహాన్ని దాటుకోని ఆయన ఇంటికి వెళ్లి రావడంతోనే సరిపోతుందని, ఇక ప్రచారం చేసేందుకు టైం ఉండడం లేదని వారు వాపోతున్నారు. ఒకవేళ మాసాబ్ ట్యాంక్‌లోని ఆయన నివాసానికి వెళ్లినా.. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఫోన్లు చేసిన లిప్ట్ చేయరని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతుండడంతో అభ్యర్థి వంశ తిలక్ వ్యవహారం ఆందోళన కల్గిస్తోందని పార్టీ శ్రేణులు వాపోతున్నారు.

నేతలు దూరం..

వంశ తిలక్ తీరు నచ్చక కీలక నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. నేతలెవరు క్రియాశీలకంగా పనిచేయడం లేదని పార్టీ క్యాడర్ భావిస్తున్నది. టికెట్ దక్కిన తర్వాత ఆయన చురుగ్గా ఉండడలేదని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. దీనికి తోడు కంటోన్మెంట్ బోర్డులో సుదీర్గకాలం పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణ చేసి, బీజేపీలో చేరిన పరశురాంను కాదని మాసాబ్ ట్యాంక్‌కు చెందిన వంశ తిలక్కు పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో గ్రూపు రాజకీయాలు, పార్టీ నేతల్లో కనిపిస్తున్నాయి. అవి ఎన్నికల్లో చేటు చేస్తాయని సొంత పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు.

దీనికి ప్రజా ప్రతినిధులు, మాజీ బోర్డు సభ్యలను సైతం తిలక్ పట్టించుకోవడంలేదని.. దీంతో వారంతా ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 42 వేల ఓట్లు సాధించిన బీజేపీకి ఈసారి అభ్యర్థి తీరుతో ఆ పార్టీ నేతలు మరింత అసంతృప్తికి లోనవుతున్నారు. అసలే అసంతృప్తితో ఉన్న నేతలు వంశ తిలక్ తీరు అసంతృప్తకి మరింత అజ్యం పోసినట్లుగా మారింది. ఎమ్మెల్యే అభ్యర్థి తీరు కొంతమంది నాయకులకు మింగుడు పడడంలేదు. వంశ తిలక్ ఒంటెత్తు పొకడ పోతున్నారని, పార్టీ నేతలను అందరిని కలుపుకోని ముందుకు పోవడం లేదన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతున్నది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed