నిరాశపరిచిన కేసీఆర్!.. బీఆర్ఎస్ లో వాట్ నెక్స్ట్?

by Prasad Jukanti |
నిరాశపరిచిన కేసీఆర్!.. బీఆర్ఎస్ లో వాట్ నెక్స్ట్?
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం అన్న సామెత ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో సరిగ్గా సరిపోతుంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అధికారంలో ఉండగా అంతా అనుకూలంగానే ఉన్నా ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలలోని వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నజర్ వేస్తుంటే మరోవైపు పార్టీలోని లీడర్లంతో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడుతుండటం ఆ పార్టీలో కలకలం రేపుతున్నది. ఇంత జరుగుతున్నా తానున్నానంటూ పార్టీ క్యాడర్ కు ధైర్యం చెప్పేందుకు అధిష్టానం ముందుకు రావడం లేదని ఓటమి నుంచి తేరుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఎలాంటి కార్యచరణ సైతం సూచించడం లేదనే టాక్ రాష్ట్ర రాజకీయాల్లో గుప్పుమంటోంది.

ఏది ఎత్తుకున్నా రివర్సే:

పార్లమెంట్ ఎన్నికల టైమ్ లో బీఆర్ఎస్ నుంచి లీడర్ల చేరికతో కాంగ్రెస్ జోష్ లో కనిపిస్తోంది. ఇక అధికార పక్షం అనే ట్యాగ్ లైన్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందనే అంచనాలతో హస్తం నేతలు ఉండగా రేపటి నుండి రాష్ట్రమంతా విజయసంకల్ప యాత్రలకు బీజేపీ రెడీ అయిపోయింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార వాహనాలను సైతం ప్రారంభించారు. అంటే రేపటి నుంచి బీజేపీ ప్రజల్లో ఉండేలా ఓ ప్రోగ్రామ్ సెట్ చేసుకుంది. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు మరో ప్రోగ్రామ్ తీసుకోలేదు. ఇటీవల కేఆర్ఎంబీ ఇష్యూతో తెలంగాణ సెంటిమెంట్ రెయిజ్ చేద్దామనుకున్నా ఈ వ్యూహానికి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. ఆటో డ్రైవర్ల ఇష్యూను తీసుకున్నా వారిని ఆదుకుంటామని మేనిఫెస్టోలోనే చెప్పామని ఇందులో బీఆర్ఎస్ రాద్దాంతం అక్కర్లేదంటూ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. దీంతో ఛాన్స్ లేకుండా బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెడుతూ వస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు, నల్గొండ సభలో బీఆర్ఎస్ తేలిపోయిందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ బర్త్ డే తర్వాత పార్టీలో పూర్తి స్థాయిలో యాక్టివిటీలు పెరుగుతాయనే ప్రచారం జరిగినా అధిష్టానం నుంచి ఇప్పటి వరకు మరొ కార్యాచరణ వెల్లడి కాలేదు. అసలే ఓటమితో సతమతం అవుతున్న తరుణంలో పార్టీ అధిష్టానం ఎటువంటి కార్యాచరణ ప్రకటించకపోవడంతో క్యాడర్ మరింత నిరాశ చెందుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తప్పించుకున్నారన్న అభిప్రాయం:

ఓటమి తర్వాత తొలిసారి నల్గొండ సభ ద్వారా బయటకు వచ్చిన కేసీఆర్ పార్టీ క్యాడర్ ను నిరాశపరిచారనే చర్చ జరుగుతోంది. నల్గొండ సభ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ కు చుక్కలే అని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసింది. కేసీఆర్ బయట అడుగు పెట్టడంతో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోగలదా అనే హైప్ క్రియేట్ చేశారు. కానీ కేసీఆర్ నల్గొండ సభను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తూర్పారబట్టారు. సభకు వచ్చి సలహాలు ఇవ్వమంటే అక్కడెక్కడికో పోయి బీరాలు పలుకుతున్నాడని కౌంటర్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ నల్గొండ సభ కంటే అసెంబ్లీకి వెళ్లలేదనేదే ప్రజల్లోకి బలంగా వెళ్లిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బడ్జెట్ చర్చలు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పై శ్వేతపత్రంపై చర్చల నుంచి కేసీఆర్ తప్పించుకున్నారనే అభిప్రాయాలను రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఇక నల్గొండ సభలోనూ కేసీఆర్ ఎన్నికల్లో ప్రజాతీర్పును స్వాగతించలేదని, ఓటమి తాలూక ప్రస్టేషన్ ను తన ప్రసంగంలో స్పష్టంగా చూపించారనే అందువల్ల ఈ సభ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన దానికంటే నిరాశపరిచిందే ఎక్కువా అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ నల్గొండ సభ తర్వాతే కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కేసీఆర్ బయటకు వచ్చాక రేవంత్ రెడ్డి జోరు పెంచారే తప్ప బీఆర్ఎస్ లో ఎక్కడా జోష్ కనిపించలేదని, ఇక ఓటమి నిరాశ నుంచి తేరుకోని లీడర్లు ఇంకా క్యాడర్ వైపు చూడటం లేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ ఎలాంటి కార్యచరణతో వస్తారో అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed