- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమానాశ్రయ భూ సేకరణపై స్తబ్ధత.. బహిరంగ మార్కెట్లో ఎకరం ఎంతో తెలుసా..?
దిశ, వరంగల్ బ్యూరో : మామునూరు విమానాశ్రయానికి కావాల్సిన భూ సేకరణ విషయంలో స్తబ్ధత నెలకొంది. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం మామూనూరులో ఎయిర్ పోర్ట్ స్థలం 693 ఎకరాలుండగా, మరో 253 ఎకరాలను గాడిపల్లి, గుంటూరు పల్లి గ్రామాల నుంచి 197 ఎకరాలు, నక్కలపల్లి గ్రామం నుంచి 149.36 ఎకరాలు, మామునూరు గ్రామం నుంచి 5 ఎకరాలను సేకరించనున్నారు. ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తి చేసిన అధికారులు మొత్తం 233 మంది రైతుల నుంచి భూ సేకరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్న భూ విలువకు.. బహిరంగ మార్కెట్లో ఉన్న భూముల ధరలకు చాలా వ్యత్యాసం ఉండటంతో విమానాశ్రయ నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియపై స్తబ్ధత ఏర్పడింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామాల్లో ఎకరం ధర కేవలం రూ.6లక్షల నుంచి 10లక్షల్లోపే నమోదై ఉండటం గమనార్హం. వాస్తవానికి జీడబ్ల్యూఎంసీ పరిధిలోని ఈ గ్రామాలలో భూముల ధరలు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు కూడా పలుకుతున్నాయి.
అలా అయితేనే ఇస్తాం..
మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి భూ సేకరణ చాలా సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. భూ బాధితులకు బహిరంగ మార్కెట్ ఆధారితంగా పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లుగా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎకరం భూమికి ఎంత చెల్లించవచ్చు అనే విషయంపై రెవెన్యూ అధికారుల నుంచి ప్రాథమిక నివేదిక కోరగా.. రూ.80 లక్షల నుంచి గరిష్ఠంగా కోటిన్నర వరకు చెల్లించవచ్చని రెవెన్యూ అధికారులు నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. అయితే అందరికీ ఒకేలా నష్ట పరిహారం ఉండాలని, అది కూడా రూ.2కోట్ల వరకు ఇవ్వాల్సిందేనని మూడు గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులు పట్టుబడుతుండటం గమనార్హం. భూములు కోల్పోతున్న కొంతమంది రైతులు మాత్రం తమ భూమిని ఇస్తున్నందుకు విమానాశ్రాయ నిర్మాణం జరిగే సమీపంలోనే స్థలాలను చూపాలని కోరుతున్నారు. దీనిపై సాధ్యసాధ్యాలపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించే పనిలో ఉన్నారు.
నగదు పరిహారం కోరే రైతులెంతమంది,? భూమి కావాలనే రైతు లెంతమంది? అనే విషయాన్ని ఇప్పటికే ఒక రిపోర్టును ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. భూములు కోల్పుతున్న రైతులు తమకు ప్రత్యామ్నాయంగా మామునూరు డెయిరీఫాం భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే రైతులు మాత్రం తమకు గుంటూరు పల్లి గ్రామంలో కావాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు. మూడు గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహించిన అధికారులు.. వారిని ఒప్పించి భూమిని స్వాధీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికి ఎక్కువ మంది రైతులు సానుకూలతను వ్యక్తం చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా ఓరుగల్లు సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కీలకమైన ఎయిర్‌పోర్ట్ నిర్మాణం విషయంలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉందని ప్రజలు గుర్తు చేస్తున్నారు. భూ సేకరణ విషయంలో రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని సూచిస్తూనే, త్వరతగతిన భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
భూ సేకరణే తరువాయి..
మామూనూరు విమానాశ్రయానికి తొలి దశలో 253 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులతో గడిచిన కొద్ది నెలలుగా సంప్రదింపులు చేస్తోంది. తాము సూచించిన అదనపు భూమి కేటాయిస్తే నిర్మాణ వ్యవహారాలు మొదలు పెడతామంటూ ఏయిర్ పోర్టు అథారిటీ అధికారులు స్పష్టం చేశారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ప్రస్తుత 1.8 కి.మీ రన్‌వేని 3.9 కి.మీకి విస్తరించడానికి వీలుగా భూ సేకరణ అవసరమని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఆపై బోయింగ్ 747 వంటి పెద్ద విమానాలకు కూడా మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు రావడానికి వెసులుబాటు దొరుకుతుందని స్పష్టం చేసింది. దీంతో ఏఏఐ సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల సేకరణ పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అందించాలని నిర్ణయించింది. విమానాశ్రయ నిర్మాణానికి మొత్తం 950 ఎకరాలు కావాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పేర్కొంది. మామూనూరులో ఇప్పటికే ఎయిర్ పోర్ట్ స్థలం 693 ఎకరాలుండగా, మరో 253 ఎకరాలను గాడిపల్లి, గుంటూరు పల్లి గ్రామాల నుంచి 197 ఎకరాలు, నక్కలపల్లి గ్రామం నుంచి 149.36 ఎకరాలు, మామునూరు గ్రామం నుంచి 5 ఎకరాలను సేకరించనున్నారు. మొత్తం 233 మంది రైతుల నుంచి భూ సేకరణ చేపట్టనున్నారు.
రూ.2కోట్లు ఇవ్వాల్సిందే :
దండ నరేష్, రైతు, గుంటూరుపల్లి
వరంగల్ కార్పోరేషన్ పరిధిలోని 17వ డివిజన్ పరిధిలో ఉన్న మా గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల్లో భూములకు బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.2కోట్లకు పైగా ఉంది. తగిన పరిహారం ఇవ్వజూపకుండా భూములను ఇవ్వాలని కోరడం అన్యాయం. మాకు తగినవిధంగా న్యాయం చేస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం.. పరిహారం చెల్లింపు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.