Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2025-03-28 11:20:39.0  )
Breaking:  విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) వద్ద కాంట్రాక్టు కార్మికులు(Contract workers) ఆందోళనకు దిగారు. తమను ఉద్యోగం నుంచి తొలగించేందుకు యాజమాన్యం కుట్ర పన్నుతోందని నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు. గతంలో 1150 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని గుర్తు చేశారు. మరో 5,500 మందిని తొలగించేందుకు రెడీ అవుతున్నారని ఆరోపించారు. ఈ రోజు వరకూ సమ్మె కొనసాగిస్తామని, యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నేపథ్యంలో తమను కాంట్రాక్టు కార్మికులుగా నియమించారని, జీతాలు సమయానికి ఇవ్వకపోయినా ఏళ్ల తరబడి పని చేశామని కాంట్రాక్టు కార్మికులు అంటున్నారు. స్టీల్ ప్లాంట్‌లో దాదాపు 14 వేల మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారని, యాజమాన్యం దశల వారీగా తొలగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్రాకేజీ ప్రకటించినా... కొందరు అధికారులు మాత్రం ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. యాజమాన్యం వెంటనే స్పందించాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని కాంట్రాక్టు కార్మికులు హెచ్చరించారు.

Next Story

Most Viewed