BRS : రుణమాఫీపై గులాబీ నేతల్లో అంతర్మథనం.. సవాల్ విసిరి తప్పు చేశామా?

by Rajesh |   ( Updated:2024-07-19 02:53:16.0  )
BRS : రుణమాఫీపై గులాబీ నేతల్లో అంతర్మథనం.. సవాల్ విసిరి తప్పు చేశామా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దూకుడు.. బీఆర్ఎస్ లీడర్లను కలవరపెడుతున్నట్టు తెలుస్తున్నది. సాధ్యం కాదనే ధీమాతో ఇష్టానుసారంగా విమర్శలు చేసి, ఇప్పుడు అభాసుపాలయ్యామని కామెంట్స్ చేస్తున్నట్టు సమాచారం. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిని అనవసరంగా రెచ్చగొట్టి తప్పుపనిచేశామని అభిప్రాయపడుతున్నట్టు చర్చ జరుగుతున్నది. మిగతా హామీలను కూడా అమలు చేస్తే తమ పార్టీ భవిష్యత్ ఏంటీ? అని మధన పడుతున్నట్టు ప్రచారం ఉంది.

ఇరుక్కున్న గులాబీ లీడర్లు

లోక్‌సభ ఎన్నికల సమయంలో రుణమాఫీ అంశాన్ని బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా చేసుకున్నది. ‘ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే మా పదవులకు రాజీనామా చేస్తాం. లేకపోతే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అని ప్రతి పబ్లిక్ మీటింగ్‌లో సవాలు విసిరారు. అందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ ‘ఎస్.. తప్పకుండా రుణమాఫీ అమలు చేసి తీరుతాం. బీఆర్ఎస్ లీడర్లు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలి’ అని ప్రతిసవాలు విసిరారు. పార్లమెంటు ఎలక్షన్స్ పూర్తయిన మరుసటి రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుపై ఫోకస్ పెట్టింది.

అందుకు కావాల్సిన నిధుల సమీకరణపై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యింది. తొలి దశలో జూలై 18న రూ.లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేయడంతో బీఆర్ఎస్ లీడర్లు కలవరపాటుకు గురైనట్టు తెలుస్తున్నది. రుణమాఫీ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల ప్రభుత్వానికి ఆ హామీని అమలు చేయాలనే పట్టుదల మరింత పెరిగేవిధంగా చేశారని కామెంట్స్ గులాబీ నేతల నుంచి వస్తున్నాయి. ‘రేవంత్‌ను రెచ్చగొట్టి తమ లీడర్లు ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని విమర్శలు చేస్తారు? ఇప్పటి నుంచైనా విమర్శలు చేసేముందు జాగ్రత్తలు తీసుకోవాలి.’ అని ఓ మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు.

కొంత కాలం మౌనం బెటర్

ఓ వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వరుసగా చేరుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ కేడర్‌లో మనోధైర్యం నింపడంపై ఫోకస్ పెట్టాలి. త్వరలో జరుగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు స్థానిక లీడర్లను సిద్ధం చేయాలి. కాని వీటన్నింటిని పక్కనపెట్టి కేవలం కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రజల్లో నవ్వుల పాలు అవుతామని అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. కనీసం రెండున్నర సంవత్సరాల పాటు ఎలాంటి విమర్శలు చేయకుండా, పార్టీ బలోపేతం కోసం దృష్టి పెట్టాలని డిమాండ్లు ఉన్నాయి. ‘ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాలు చేస్తామని ప్రకటనలు చేసిన లీడర్లు అందుకు రెడీగా ఉండాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించడంతోనైన తమ పార్టీ లీడర్లలో మార్పు రావాలి అని గులాబీ కేడర్ కామెంట్ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed