రూ.2 లక్షల రైతు రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-07-03 12:41:20.0  )
రూ.2 లక్షల రైతు రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ సర్కార్ రూ.2 లక్షల రుణమాఫీకి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రుణమాఫీపై కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ త్వరలోనే చేస్తామని చెప్పారు. పంద్రాగస్ట్‌లోపు ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చెప్పిన విషయం తెలిసిందే. ఇక, అనుకున్న సమయం కంటే ముందే ఆరు గ్యారెంటీలు అమలు చేశామని భట్టి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదేండ్లలో కూడా చేయలేదని.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే రుణమాఫీ ఎప్పుడు చేస్తారని మమ్మల్ని అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన రైతు బంధు స్కీమ్ పేరును రైతు భరోసాగా మార్చామని తెలిపారు.

ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కట్టిన ప్రతి పైసా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు తీసుకుని రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాల గైడ్ లైన్స్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం ప్రకారమే ఎవరికి పథకాలు ఇవ్వాలి.. ప్రభుత్వ ఖజానా దేనికి ఖర్చు పెట్టాలనేది నిర్ణయిస్తామన్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి వచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. కాగా, రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డిప్యూటీ భట్టి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ రైతు భరోసా పథకానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించి ప్రభుత్వాన్ని సిఫారస్ చేయనుంది.

Advertisement

Next Story