Deputy CM: ఆ సూత్రాలను పాటించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం

by Gantepaka Srikanth |
Deputy CM: ఆ సూత్రాలను పాటించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రాల సమూహమే యూనియన్ అనే సహకార సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు లభించే హక్కుల్ని హరిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా రాష్ట్రాలకు అన్యాయం చేయడమే కాకుండా వాటి అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నదని, ఇది పురోభివృద్ధికి ప్రతిబంధకంగా మారిందన్నారు. తిరువనంతపురంలో గురువారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కాంక్లేవ్‌కు హాజరైన తెలంగాణ డిప్యూటీ సీఎం (ఆర్థిక మంత్రి బాధ్యతలు కూడా) మాట్లాడుతూ, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఆర్థిక సంబంధాలు టెక్నికల్ అంశం మాత్రమే కాదని, సమానత్వం, స్వయంప్రతిపత్తి, సమర్ధత సూత్రాల ప్రాతిపదికన రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయడమని అన్నారు.

ఈ సూత్రాలను పాటించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఫెడరల్ స్ట్రక్చర్‌కు విఘాతం కలిగిస్తున్నదని, రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటున్నదని, అంతిమంగా రాష్ట్రాల మధ్య అనైక్యతకు, అసమానతకు కారణమవుతున్నదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధిలో బలంగా ఉండాలన్నది రాజ్యాంగ మౌలిక సూత్రమని, రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్... కేంద్ర అధికారాలను పరిమితం చేశారని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని నొక్కిచెప్పారు. అది విఫలమైతే రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడానికి దారితీస్తుందని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రాల ఆర్థిక అధికారాలను కేంద్రం కబ్జా చేయడంతో అవసరమైనన్ని నిధుల్లేక అభివృద్ధకి ఆటంకం ఏర్పడుతున్నదని వివరించారు.

కేంద్రానికి రాష్ట్రాలు వసూలు చేసి ఇస్తున్న పన్నుల్లో 13వ ఫైనాన్స్ కమిషన్ సమయానికి 32% మాత్రమే రాష్ట్రాలకు డివొల్యూషన్ (పన్నుల వాటా)లో అందేవని, 14వ ఆర్థిక సంఘం దీన్ని 42% కి పెంచడం ద్వారా కాస్త వెసులుబాటు లభించిందన్నారు. కానీ పూర్తి స్థాయిలో న్యాయం లభించలేదని, ఆ 10% పెంపుతో వాస్తవికమైన నిధుల వరద రాష్ట్రాలకు అందడంలేదని నొక్కిచెప్పారు. కారణం కేంద్ర ప్రభుత్వం సెస్‌, సర్‌చార్జీల పేరుతో వసూళ్ళు చేస్తున్నదని, ఇలా సమకూరిన ఆదాయంలో రాష్ట్రాలకు ఎలాంటి వాటా ఉండడంలేదని, మొత్తం కేంద్రానికే వెళ్ళిపోతున్నాయన్నారు. దేశ మొత్తం జీడీపీలో ఈ రూపంలో అందుతున్న ఆదాయం దాదాపు 28% అని పేర్కొన్నారు. సెస్, సర్‌చార్జీలు తాత్కాలికమేనని కేంద్రం చెప్తున్నా మరో రూపంలో ఏటేటా శాశ్వత ప్రాతిపదికన అమలు చేస్తూ ఉన్నదన్నారు.

దీనికి తోడు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపులోనూ కేంద్రం తాత్సారం చేస్తున్నదని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో రూపొందించుకున్న అంచనాలకు అనుగుణంగా సకాలంలో అందకపోవడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సంకటం ఏర్పడుతున్నదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా రీత్యా 19% ఉన్నప్పటికీ మొత్తం జీడీపీలో 30% వాటాను అందిస్తున్నాయని, కానీ డివొల్యూషన్ ద్వారా 21% (11వ ఆర్థిక సంఘం) అందితే 15వ ఆర్థిక సంఘం నాటికి 15.8% మాత్రమే అందుతున్నదన్నారు. జనాభా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సమర్ధవంతంగా అమలు చేసినందుకు ప్రోత్సాహం లభించడానికి బదులుగా ఆర్థిక నిధుల విడుదలకు జనాభా లెక్కలను (2011నాటి) ప్రామాణికంగా తీసుకోవడంతో కోత పడినట్లయిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రాలకు ఇస్తున్న నిధులకు దేశమంతా ఒకే ఫార్ములాను రూపొందించడంతో రాష్ట్రాల్లోని ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయడంలో చిక్కులు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇస్తున్న రూ. 4.80 లక్షల కోట్లలో ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలకు అందే నిధులు మూడవ వంతు (రూ. 1.32 లక్షల కోట్లు)గానే ఉన్నాయన్నారు. ఇంకోవైపు రాష్ట్రాలు తీసుకునే అప్పుల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకుని పరిమితుల ఆంక్షలు విధిస్తున్నదని, కానీ కేంద్రం మాత్రం యధేచ్ఛగా అప్పులు తీసుకుంటున్నదన్నారు. మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియకు కూడా 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటున్నందున జనాభా నియంత్ర్ (ఫ్యామిలీ ప్లానింగ్)ను సమర్ధవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి పార్లమెంటులో గొంతు వినిపించలేని పరిస్థితి నెలకొన్నదని వ్యాఖ్యానించారు.

వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50% అందాలని, జీడీపీలో ఆయా రాష్ట్రాల కంట్రిబ్యూషన్‌కు తగిన నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని, కేంద్రం ప్రస్తుతం వసూలు చేస్తున్న సెస్, సర్‌చార్జీల విషయంలో రాష్ట్రాలకూ వాటా ఇచ్చేలా మార్పులు జరగాలని, రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కేంద్ర పరిమితులను ఎత్తివేసి స్వయంప్రతిపత్తి కల్పించాలని, నియోజకవర్గాల డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు పొలిటికల్ వాయిస్ ఉండేలా నిబంధనలను, గైడ్‌లైన్స్ మార్చాలని, ఆర్థిక అంశాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని అక్షరాలా కేంద్రం అమలు చేయాలని అన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో 16వ ఆర్థిక సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ కాంక్లేవ్‌లో చేసిన తీర్మానాన్ని పంపాలన్న నిర్ణయం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed