మాది బెదిరించే ప్రభుత్వం కాదు: భట్టి విక్రమార్క

by GSrikanth |
మాది బెదిరించే ప్రభుత్వం కాదు: భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో 'ప్రజాపాలన' అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించగా జిల్లాలలో మంత్రులు ప్రారంభించారు. ఆదిలాబాద్‌లో మంత్రి సీతక్క, బంజారాహిల్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పలు చోట్ల ప్రత్యేక క్యూలైన్లు, రద్దీ నియంత్రణకు బందోబస్తును ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని 12,769 పంచాయితీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 3,714 అధికార బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. పది శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం రోజుకు రెండు గ్రామాలు లేదా రెండు వార్డుల్లో పర్యటించి ప్రజాసదస్సులను నిర్వహించనున్నది. ఈనెల 31, జనవరి 1 సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ, వార్డుల సభల్లో ఈ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. తొలిరోజు కావడంతో పలు చోట్ల అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రజల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులో ఉన్న సమాచారం ఆధారంగా ఆరు గ్యారెంటీ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

బెదిరించే ప్రభుత్వం కాదు మాది: భట్టి

గత ప్రభుత్వంలా మా పార్టీలోకి వస్తేనే పథకాలిస్తామని చెప్పబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన.. ఈ ప్రభుత్వం ఏ ఒక్కరిదో కాదని అందరి ప్రభుత్వం అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని అందుకే ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అర్హులైన అందరికి పథకాలను అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలను తప్పసనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

పైరవీలకు ఛాన్స్ లేదు: పొన్నం

ఆరు గ్యారెంటీల అమలులో పైరవీలకు ఛాన్స్ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్ లో 600 కేంద్రాల్లో అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఎవరికైనా సందేహాలు ఉంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed