ఇంటి పెద్ద ఖాతాలో లక్ష జమ చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి మరో కీలక హామీ

by Gantepaka Srikanth |
ఇంటి పెద్ద ఖాతాలో లక్ష జమ చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి మరో కీలక హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఇంటి పెద్ద ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు, నిరుద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు భట్టి హాజరయ్యారు. సభకు ముందు ప్రధాన అతిథిగా విచ్చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే బీజేపీ మాత్రం కొద్దిమంది పెద్దల కోసం మాత్రమే పనిచేస్తుందన్నారు. ఇక కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ పేదల గురించే ఆలోచన చేస్తుందని, బీజేపీ ఇప్పటి వరకు పేదలకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

అదానీ, అంబానీలకు మాత్రం రూ.16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారన్నారు. మోడీ పదేళ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం దేశ సంపద పంపిణీ జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. అదేవిధంగా అన్ని చోట్ల రిజర్వేషన్లు పెంచుతామని ఇండియా కూటమి స్పష్టం చేసిందన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల ఆరోగ్య భీమాకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామని, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు.

Advertisement

Next Story