సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. కొత్త సచివాలయంలోకి విపక్ష లీడర్లకు నో ఎంట్రీ!

by GSrikanth |
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. కొత్త సచివాలయంలోకి విపక్ష లీడర్లకు నో ఎంట్రీ!
X

కొత్త సచివాలయంలోకి విపక్ష లీడర్లను రానివ్వొద్దని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అన్ని శాఖల సెక్రటరీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. తమ అనుమతి లేనిదే ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. తమను కలిసేందుకు వస్తున్న విపక్ష నేతలకు ఏం సమాధానం చెప్పాలో తెలీక ఐఏఎస్ ఆఫీసర్లు లోలోపల మదన పడుతున్నట్టు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: తమ అనుమతి లేకుండా అపోజిషన్ లీడర్లకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్ గతంలోనే సెక్రటరీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ నిర్మించిన తర్వాత మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసినట్టు తెలుస్తున్నది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కలెక్షన్ టెండర్ పై వినతి పత్రం ఇచ్చేందుకు ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు ఫోన్ చేశారు. పలుసార్లు ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ కాలేదని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. దీంతో కొత్త సెక్రటేరియట్‌లో ఉన్న అరవింద్‌ను కలిసేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వచ్చారు. అపాయింట్‌మెంట్ లేకుండా లోనికి అనుమతించబోమని పోలీసులు కరాఖండిగా చెప్పి ఆయన్ను అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు.

ఆందోళనలు చేస్తారని భయం

విపక్షాలను లోనికి అనుమతించకుండా సీఎం కేసీఆర్ సీరియస్‌గా నిర్ణయం తీసుకోడానికి పలు కారణాలు ఉన్నాయని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. తొలి ప్రభుత్వంలో వివిధ పనుల పేరుతో సెక్రటేరియట్‌లోకి వచ్చిన విపక్ష ఎమ్మెల్యేలు సీ బ్లాక్ ముందు ధర్నాలు చేశారు. ఈ ఆందోళనలపై అప్పట్లో సీఎం కేసీఆర్ చాలా సీరియస్ అయినట్టు ప్రచారం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన బిల్డింగ్ కూల్చి కొత్త సెక్రటేరియట్ కట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ బిల్డింగ్‌ను కూల్చొద్దని, లోనికి వచ్చి ప్రతి భవనాన్నీ పరిశీలించి హడావుడి చేశారు. అప్పటి నుంచి విపక్షాలను సెక్రటేరియట్‌లోనికి అనుమతించొద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది.

జంకుతున్న ఐఏఎస్ అధికారులు

అపాయింట్‌మెంట్ కోసం విపక్ష లీడర్లు ఫోన్లు చేస్తే ఏం సమాధానం చెప్పాలో తెలీక ఐఏఎస్ అధికారులు లోలోపల మదన పడుతున్నారు. ఒకవేళ కలిసేందుకు టైమ్ ఇస్తే ప్రభుత్వం నుంచి చివాట్లు వస్తాయని, అలాగని ఇవ్వకపోతే ప్రతిపక్షాల లీడర్లు బండబూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌కే భవన్ కేంద్రంగా సెక్రటేరియట్ పని చేసిన టైమ్‌లో కాంగ్రెస్, బీజేపీ లీడర్లు సీఎస్, ఇతర ఐఏఎస్ అధికారుల అపాయింట్‌మెంట్ కోసం చాలా సార్లు ప్రయత్నాలు చేశారు. అయితే కొందరు లీడర్లు పదే పదే ఒత్తిడి చేస్తే నాటి సీఎస్‌లు ఎస్కే జోషీ, సోమేశ్ కుమార్ ప్రగతిభవన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే విపక్ష లీడర్లకు టైమ్ ఇచ్చినట్టు తెలిసింది.

చిన్న నిరసన కనిపించినా అంతే సంగతులు

కొత్త సెక్రటేరియట్ ముందు ఆందోళనలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ పోలీసు విభాగానికి ప్రభుత్వం హెచ్చరించినట్టు తెలుస్తున్నది. అందుకే బిల్డింగ్ చుట్టూ నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అర కిలోమీటర్ ముందు నుంచే వెహికల్స్ కదలికలను గమనిస్తున్నారు. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తుల ప్రతి మూవ్‌మెంట్‌నూ పసిగడుతున్నారు. అనుమానం వస్తే వెంటనే అలర్ట్ చేసి, పక్కనే ఉన్న పోలీసు టీమ్‌లను అక్కడికి పంపుతున్నారు. విజిటర్ పాసుల కోసం వచ్చిన వారు లోనికి వెళ్లి ఏదైనా ఆందోళనలు చేస్తారనే అనుమానంతో వారిని పలుసార్లు చెక్ చేస్తున్నారు. అలాగే వారి అడ్రస్, ఆధార్, ఫోన్ నంబర్ వంటి వివరాలు కూడా తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed