ప్రజలతో మమేకం అయ్యేందుకు సైకిల్ పెట్రోలింగ్.. : రాచకొండ సీపీ సుధీర్ బాబు

by Rajesh |
ప్రజలతో మమేకం అయ్యేందుకు సైకిల్ పెట్రోలింగ్.. : రాచకొండ సీపీ సుధీర్ బాబు
X

దిశ, క్రైమ్ బ్యూరో : వాహనదారులకు సురక్షితమైన ప్రయాణంతో పాటు రోడ్డు భద్రతను అందించే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. బుధవారం సీపీ సుధీర్ బాబు ‘దిశ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ట్రాఫిక్ జామ్, రద్దీ సమయాల్లో రోడ్డు‌పై ట్రాఫిక్ రాకపోకలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారుల ట్రావెలింగ్ టైంను తగ్గించి రోడ్డు సేఫ్టీని పెంచుతామన్నారు. అదే విధంగా ట్రాఫిక్ అధికారులందరూ రాకపోకలు సాఫీగా సాగించేందుకు ఫీల్డ్ డ్యూటీ చేసేలా కార్యాచరణను రూపొందించామన్నారు. రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాల్లో జరిగే మరణాలు, రోడ్లపై ఉండే అడ్డంకులను తొలగించి వాహనదారుడి ప్రయాణానికి ఉపయోగపడే రోడ్డు మార్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు. వాహనదారులు క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్‌ను చేసే విధంగా వారికి ట్రాఫిక్ రూల్స్‌తో పాటు నిబంధనలను ఉల్లంఘిస్తే అమల్లో ఉన్న చట్టాల గురించి కూడా వివరిస్తామన్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా యాక్సిడెంట్ అనాలిసిస్ ప్రివెన్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో పోలీసులతో పాటు రోడ్లపై వాహనదారుల సురక్షిత ప్రయాణం కల్పించే భాగస్వామ్యం ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలు, జీహెచ్ఎమ్‌సీ, నేషనల్ హై-వే అథారిటీస్, రోడ్డు భవనాల శాఖ, విద్యుత్ శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు ఉంటారని తెలిపారు. ఒక రోడ్డు ప్రమాదం జరిగినా, నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ, వాహనదారులను ఇబ్బందులకు గురి చేసే ఇతర అంశాలు తలెత్తినప్పుడు వాటిని ఈ టీమ్ విశ్లేషిస్తుంది. ఈ టీమ్‌లో ఉండే గ్రూపు సభ్యులతో కూడిన యాప్ ను కూడా ఏర్పాటు చేశాం. ప్రభుత్వ శాఖ అధికారులకు వాటిని వివరించి సమస్యను పరిష్కరిస్తాం. దీంతో కాలాయాపన తగ్గి సత్వర పరిష్కారానికి వేదికగా ఇది ఉంటుంది.

సైకిల్‌పై పోలీసు పెట్రోలింగ్ :

సిబ్బందికి ఆరోగ్యంతో పాటు ప్రజలతో పోలీసులు ఉండే విధంగా సరికొత్తగా సైకిల్ పెట్రోలింగ్‌ను ప్రారంభించాం. దీని కోసం ప్రతి పోలీసు స్టేషన్‌కు రెండు నుంచి మూడు సైకిల్‌లను అందించాం. పోలీసు స్టేషన్‌కు సమీపంలోని ప్రాంతాల్లో ఈ సైకిల్‌పై పోలీసులు గస్తీ తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతారు. వారితో మాట్లాడి స్థానికంగా నెలకొన్న అంశాలు, సమస్యలపై చర్చిస్తారు. ఇలా చేయడం వల్ల పోలీసులు, ప్రజల మధ్య స్నేహభావం పెరుగుతుంది. దీనికి తోడు పోలీసులకు కూడా ఉద్యోగంతో పాటు ఆరోగ్యం లభిస్తుంది. ఈ సైకిల్ పెట్రోలింగ్ కు మంచి స్పందన లభిస్తుంది. అదే విధంగా డ్రగ్స్, సైబర్ నేరాలపై కూడా సైకిల్‌లపై తిరుగుతూ పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తారు.

క్రైం చేసిన వారికి శిక్ష పడాల్సిందే.. :

ఒక నేరం జరిగితే అందులో పాల్గొన్న నేరస్థులకు శిక్ష పడాల్సిందే. ఈ లక్ష్యంగా కేసు నమోదు నుంచి విచారణ పూర్తయి శిక్ష ఖరారయ్యే వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తుంటాం. దీనికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. కోర్టు విచారణ సమయంలో బాధితులకు అండగా నిలబడతాం. సాక్ష్యులు కూడా భయాందోళనకు గురి కాకుండా వారికి తోడుగా ఉంటాం. విచారణ ప్రక్రీయపై అవగాహన కల్పిస్తాం. చివరకు శిక్షలు పడేలా పోలీసు దర్యాప్తులో నమోదు చేసిన అభియోగాలన్నింటిని నిరూపిస్తాం. ప్రతి కేసును ప్రతి అధికారి చివరి వరకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించుకుంటారు. ఇలా చేయడంతో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నేరస్థులకు శిక్షలు అధికంగా ఖరారవుతున్నాయి. ఒక శిక్ష ఖరారు తీర్పు వంద నేరాలను జరగకుండా భయాన్ని నెలకొల్పుతుంది.

క్రిమినల్స్ హిస్టరీ‌పై అప్‌డేట్‌గా ఉంటాం.. :

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్‌లు, హిస్టరీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్‌లు, ల్యాండ్ గ్రాబర్స్‌పై నిరంతరం అప్‌డేట్‌గా ఉంటున్నాం. ఇప్పటి వరకు నమోదైన వారందరీ చిట్టాను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటున్నాం. వారి కదలికలపై ఫోకస్ పెడుతున్నాం. ప్రస్తుతం వారు ఎక్కడెక్కడ ఉంటున్నారు. ఏం చేస్తున్నారని విషయాలను తెలుసుకుంటున్నాం. వారి వ్యవహారాల్లో అనుమానాలు ఉంటే చట్టపరంగా కఠినంగా ఉంటాం. భూ వివాదాల్లో చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తాం. భయాభ్రాంతులకు గురి చేసినా, అమాయకుల స్థలాలను కబ్జా చేయాలని చూసినా గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకున్నా, సెటిల్మెంట్ లకు పాల్పడినా పోలీసులు కఠినంగా ఉంటారు. అవసరమైతే చట్ట పరిధిలో ఉండే అనుమతులను పరిశీలించి పీడీ యాక్ట్‌లను విధిస్తాం.

సిబ్బంది సంక్షేమంపై స్పెషల్ ఫోకస్ :

సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటాను. వారికి సమయానికి రావాల్సిన అన్ని ప్రోత్సాహకాలు, పదోన్నత్తులు వంటి అంశాల్లో జాప్యం లేకుండా చూస్తాం. సిబ్బంది ఆరోగ్య పరంగా వారికి ఒత్తిడి లేని వాతావరణం కల్సిస్తాం. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటనే పోలీసు సేవలు ప్రజలకు సమర్ధవంతంగా అందుతాయి.

ప్రాథమిక పోలీసు సేవలు అందించడమే లక్ష్యం.. :

టెక్నాలజీ ఎంత పెరిగినా పోలీసు స్టేషన్‌కు వచ్చే పౌరుడికి, బాధితుడికి మర్యాదపూర్వకంగా ప్రాధమిక సేవలు అందేలా చర్యలను తీసుకుంటాం. ప్రజల పట్ట ఫ్రెండ్లీగా ఉంటాం. క్రిమినల్స్ తో చట్టపరంగా పోలీసులు కఠినంగా ఉంటాం. శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా విజుబుల్ పోలీసింగ్‌ను పెంచుతాం. సామాన్యుడికి పోలీసు కనపడేలా చేసి వారికి భద్రత పరంగా భరోసానిస్తాం. కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు, సైబర్ వారియర్‌లు క్రీయాశీలంంగా పని చేసేలా చర్యలను తీసుకుంటున్నాం. ఆర్థిక నేరాలను అరికట్టడానికి ప్రత్యేకంగా ఆర్ధిక నేరాల నియంత్రణ విభాగం పని చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలో సమన్వయంతో పని చేసి పోలీసింగ్‌ను బలోపేతం చేస్తాం.

Advertisement

Next Story

Most Viewed