Alert: లింక్​క్లిక్​చేశారో.. ఖాతా ఖాళీ కావటం ఖాయం

by GSrikanth |   ( Updated:2023-10-22 12:08:36.0  )
Alert: లింక్​క్లిక్​చేశారో.. ఖాతా ఖాళీ కావటం ఖాయం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బ్యాంక్​కస్టమర్​కేర్​సర్వీస్ ప్రతినిధినంటూ ఏదైనా మీ ఫోన్‌లైన్‌లోకి వచ్చాదా? లింక్​పంపిస్తున్నా మీ ఖాతా వివరాలను అప్​డేట్​చేయండని ఎవరైనా చెప్పారా? ఒక్క క్షణం ఆలోచించండి. ఆలోచించకుండా లింకుపై క్లిక్​చేసి మీ అకౌంట్​వివరాలను అప్ లోడ్ చేశారో? అంతే సంగతులు. క్షణాల్లో మీ ఖాతాలోని డబ్బు మాయం కావటం ఖాయం. మీ ఖాతా బ్లాక్ కూడా అవుతోంది. వెంటనే మేం పంపించిన లింకుపై క్లిక్​చేసి పాన్​కార్డు ఇతర వివరాలను అప్​గ్రేడ్​చేయండని మొబైల్‌కు మెసేజీ వచ్చినా వెంటనే అలర్ట్​అవండి. అలా కాకుండా కంగారులో వచ్చిన లింకును క్లిక్​చేశారో.. చేజేతులా మీ డబ్బును మీరే పోగొట్టుకున్నవారు అవుతారు. ఎక్కడో వందలు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉండి రకరకాల మార్గాల్లో జనం డబ్బును దోచుకుంటున్న సైబర్​నేరగాళ్లు ఇటీవలిగా తరచూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. వందలు.. వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. జరుగుతోంది మోసం అని గ్రహించే లోపే ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేసేస్తున్నారు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఒకవేళ నిందితులు పట్టుబడినా చాలాసార్లు వాళ్లు కొల్లగొట్టిన డబ్బులో పదో శాతం కూడా రికవరీ కావటం లేదు.

దేశవ్యాప్తంగా సాంప్రదాయ నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా సైబర్​నేరాలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పెట్టుబడులు, వర్క్​ఫ్రం హోం, వ్యాపార అవకాశాలు, పార్ట్​టైం ఉద్యోగాలు, రేటింగ్​ఫ్రాడ్​స్టర్లు, బ్యాంక్​ఎగ్జిక్యూటీవ్‌ల పేర సైబర్​నేరగాళ్లు నిత్యం జనాన్ని లూటీ చేస్తున్నారు. మరికొందరు హనీ ట్రాప్‌లు చేస్తూ బ్లాక్​మెయిలింగ్​చేయటం ద్వారా డబ్బు గుంజుతున్నారు. దీని కోసం వాట్సాప్, టెలిగ్రామ్ తదితర యాప్‌లను ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్‌లోని ఆజంఘడ్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, జార్ఖండ్‌లోని జామ్​తారా, దియోఘర్, పశ్చిమ బంగలోని అసన్​సోల్, దుర్గాపూర్, అస్సాంలోని బర్​పేట్, దుబ్రీ, గోల్​పార, పారెగావ్, నగాడ్, బిహార్‌లోని బంకా, బెగుసరాయ్, జముయ్, నవాడ, నలార, గయా, ఢిల్లీలోని అశోక్​నగర్, ఉత్తమ్​నగర్, శక్కర్​పూర్, హర్కేశ్​నగ, ఓక్లా, ఆజాద్​పూర్, హర్యానాలోని మేవత్, భివానీ, నూహ్, పల్వల్, మనాట, హసన్​పూర్, హతన్​గావ్​కేంద్రాలుగా చేసుకొని సైబర్​క్రిమినల్స్​విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నారు.

ఒకే భవనంలో..

పోలీసు వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఆజంఘడ్‌లో ఒకే భవనంలో, ఒక్కో క్యూబ్‌లో ఒక్కో పేరుతో మొత్తం 3వేల కంపెనీలు నడుపుతున్నట్టు తెలిసింది. వీళ్లలో చాలామంది వేర్వేరు బ్యాంకుల కస్టమర్​కేర్​సర్వీస్​పేరిట సెర్చ్​ఇంజన్లలో పేజీలు క్రియేట్​చేసి పెట్టినట్టు సమాచారం. ఎవరైనా అవసరమై కస్టమర్​కేర్​నెంబర్​కోసం సెర్చ్​ఇంజన్‌లో సెర్చ్​చేస్తే ఈ సైబర్​నేరగాళ్ల మొబైల్​నెంబర్లు ప్రత్యక్షమవుతున్నాయి. నిజమైనవే అనుకుని ఫోన్​చేస్తే అవతలి నుంచి చక్కటి ఇంగ్లీషులో మీకు ఎలా సాయపడగలమంటూ మొదలుపెట్టి సైబర్​నేరగాళ్లు అవతలి వారిని నైస్‌గా ఉచ్ఛులోకి లాగుతున్నారు. ముందు సమాచారం తీసుకుని మీకో లింక్​పంపిస్తున్నాం.. వివరాలు అప్​లోడ్​చేయండంటూ బ్యాంక్​ఖాతా వివరాలు, కేవైసీ, ఓటీపీ నెంబర్లు, డెబిట్, క్రెడిట్​కార్డులు ఇన్ఫర్మేషన్​తీసుకుంటున్నారు. ఒక్కసారి ఈ వివరాలను అవతలివారు పంపిన లింకును క్లిక్​చేసి అప్​లోడ్​చేయగానే క్షణాల వ్యవధిలో ఖాతాల్లో నుంచి లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. దీనికి తాజా నిదర్శనంగా తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో పని చేస్తున్న శ్రీధర్​రావు దేశ్​పాండే ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఎస్బీఐ అలకాపురం బ్రాంచ్​స్విఫ్ట్​కోడ్​తెలుసుకునేందుకు కస్టమర్​కేర్​కోసం సెర్చ్​ఇంజన్‌లో సెర్చ్​చేసిన ఆయన అక్కడ కనిపించిన నెంబర్‌కు ఫోన్​చేశారు. అవతలి వ్యక్తి పంపించిన లింకును క్లిక్​చేసి అడిగిన వివరాలను అప్​లోడ్​చేశారు. 24 గంటల్లో మీ మొబైల్‌కు స్విఫ్ట్​కోడ్​వాట్సాప్‌లో వస్తుందని చెప్పి అవతలి వ్యక్తి ఫోన్​పెట్టేశాడు. స్విఫ్ట్​కోడ్​రాలేదుగానీ రెండు విడతల్లో ఆయన ఖాతాలో నుంచి 8 లక్షల రూపాయలను సైబర్​క్రిమినల్స్​కొట్టేశారు. అప్పుడుగానీ మోసపోయినట్టు గ్రహించిన శ్రీధర్​రావు దేశ్​పాండే ఎల్బీనగర్​సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అకౌంట్​ బ్లాక్..

ఇక, జనం నుంచి డబ్బు కొల్లగొట్టటానికి ఇటీవలిగా సైబర్​క్రిమినల్స్​మరో కొత్త దారి కని పెట్టుకున్నారు. దాని ప్రకారం మీ ఖాతా ఈ రోజు బ్లాక్​అవుతోంది.. అలా జరగకుండా ఉండాలంటే నెట్​బ్యాంకింగ్‌కు మీ పాన్​కార్డు వివరాలను అప్​గ్రేడ్​చేయండి అని పేర్కొంటూ లింకును మెసేజ్​చేస్తున్నారు. అయ్యో.. అకౌంట్​బ్లాక్​అవుతోందా? అన్న కంగారులో ఎవరైనా ఆ లింకును క్లిక్​చేసి అడిగిన వివరాలను అప్​లోడ్​చేసిన వెంటనే వారికి సంబంధించిన ఖాతాల్లోని డబ్బును ఊడ్చేస్తున్నారు.

ఏ బ్యాంకు అడగదు..

ఏ జాతీయ బ్యాంకు కూడా ఖాతాదారులను ఆన్​లైన్‌లో కేవైసీ, ఓటీపీ, డెబిట్, క్రెడిట్, ప్యాన్​కార్డు, ఆధార్​కార్డు వివరాలను అప్​గ్రేడ్​చేయండని అడగదని ఎస్బీఐ బ్యాంక్​సీనియర్​ఉద్యోగి శ్రీనివాస్​చెప్పారు. కస్టమర్​కేర్​సర్వీస్​కావాలనుకుంటే సెర్చ్​ఇంజన్లలో అస్సలు సెర్చ్​చేయవద్దని ఆయన సూచించారు. డెబిట్, క్రెడిట్​కార్డులపై, బ్యాంకు పాస్​బుక్కుల్లో కస్టమర్​కేర్​టోల్​ఫ్రీ నెంబర్లు ఉంటాయని, వాటికి మాత్రమే ఫోన్​చేయాలని చెప్పారు. ఇదే విషయమై అమితాబ్​బచ్చన్​లాంటి స్టార్​సెలబ్రెటీలతో ప్రకటనలు తయారు చేయించి విస్తృతంగా ప్రచారం చేసినట్టుగా తెలిపారు. అయినా, చాలామంది సైబర్​నేరగాళ్ల ఉచ్ఛులో చిక్కుకుని డబ్బు పోగొట్టుకుంటున్నారన్నారు.

Advertisement

Next Story