సైబరాబాద్ ​పోలీసుల పెద్ద మనసు.. హోంగార్డు కుటుంబానికి రూ.11.60 లక్షల ఆర్థిక సాయం

by Satheesh |
సైబరాబాద్ ​పోలీసుల పెద్ద మనసు.. హోంగార్డు కుటుంబానికి రూ.11.60 లక్షల ఆర్థిక సాయం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబరాబాద్ ​పోలీసులు పెద్ద మనసు చాటుకున్నారు. కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర పిలుపు మేరకు తలా ఓ చేయి వేసి విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. తోచినంతగా విరాళం ఇచ్చి మొత్తం 11లక్షల అరవై వేల రూపాయలను జమ చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును శుక్రవారం కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర తన కార్యాలయంలో చనిపోయిన హోంగార్డు కుటుంబానికి అందచేశారు. దీనిపై ఆ హోంగార్డు కుటుంబం కృతజ్ఞత వ్యక్తం చేయగా.. ఇన్నాళ్లకు మమ్మల్ని ఓ ఆఫీసర్​గుర్తించారని హోంగార్డులు అంటున్నారు.

మేడ్చల్​ట్రాఫిక్​పోలీస్​స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న జీ.శ్రీనివాస్​జనవరి 25న కండ్లకోయ జంక్షన్‌లో డ్యూటీలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండటం.. కుటుంబం నిరుపేదది కావటంతో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్న సైబరాబాద్​కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర ఉన్నతాధికారుల నుంచి దీని కోసం అనుమతి తీసుకున్నారు.

అనంతరం తోచినంత మొత్తాన్ని శ్రీనివాస్ కుటుంబానికి విరాళంగా ఇవ్వాలని కమిషనరేట్​పరిధిలోని సిబ్బందికి పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన సిబ్బందితో పాటు సీఎస్సార్​కార్పోరేట్​సెక్టార్ ఉద్యోగులు కలిసి 11లక్షల అరవై వేల రూపాయలను జమ చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును శుక్రవారం కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర తన కార్యాలయంలో శ్రీనివాస్​భార్యకు అందచేశారు.

ఇక, శ్రీనివాస్‌కు హెచ్డీఎఫ్సీ​బ్యాంక్‌లో సాలరీ అకౌంట్​ఉన్న నేపథ్యంలో సదరు బ్యాంక్​అధికారులతో కూడా కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర మాట్లాడారు. శ్రీనివాస్‌కు ఇన్సూరెన్స్ మొత్తంగా రావాల్సిన 30లక్షల రూపాయలను కూడా అతని కుటుంబానికి ఇప్పించారు. ఇక, మేడ్చల్​ట్రాఫిక్​పోలీస్​స్టేషన్​ఇన్స్​పెక్టర్​బీఎన్ఎస్.రెడ్డి సంవత్సరంపాటు శ్రీనివాస్ తల్లికి ప్రతీనెలా రెండున్నర వేల రూపాయలు ఆర్థిక సాయంగా ఇవ్వటానికి ముందుకొచ్చారు.

మానవత్వంతో స్పందించి శ్రీనివాస్​కుటుంబాన్ని ఆర్థికంగా సాయం చేసిన అందరికీ.. ఇన్సూరెన్స్ చెక్కును కొన్ని రోజుల్లోనే ఇచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్​అధికారులకు కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్​జాయింట్​కమిషనర్​నారాయణ్​నాయక్, అదనపు డీసీపీ శ్రీనివాస్​రెడ్డి, ఏసీపీ వెంకట్​రెడ్డి, ఇన్స్​పెక్టర్​నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story