- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కసరత్తు

దిశ, తెలంగాణ బ్యూరో: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తున్నది. అటవీ ప్రాంతాల్లోని గిరిజనులకు కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ (సీఎస్ఆర్) కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. గతంలో అటవీ భూముల్లో వ్యక్తిగత హక్కుల కల్పనలో భాగంగా పోడు సాగు రైతులకు పట్టాలు ఇవ్వగా.. ఈసారి సామాజిక అటవీ హక్కుల కల్పనలో భాగంగా ఆవాసం పరిధిలోని గిరిజనులందరికీ లబ్ది కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏలు ఉన్నాయి. ఇందులోని మూడు వేల ఆవాసాల్లో సీఎస్ఆర్ అమలుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక కార్యాచరణను రూపొందించింది. ప్రతి ఆవాసానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోని వనరుల ద్వారా గిరిజనులు ఏ విధంగా లబ్ధి పొందవచ్చనే అంశంపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరీశీలన చేస్తున్నారు. ప్రతి ఆవాసానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎలాంటి వనరులున్నాయి? వాటి ద్వారా ఏ విధంగా లబ్ధి పొందవచ్చు? అటవీ సంపద పెంచే కార్యక్రమాలు, పరిరక్షణ చర్యలు.. తదితర కోణాల్లో సీఎస్ఆర్ ను అమలు చేసే విధంగా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో సీఎస్ఆర్ సక్సెస్
దేశంలోని పలు రాష్ట్రాల్లో సీఎస్ఆర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తుండగా, చాలాచోట్ల గిరిజనులు సంతృప్తికరంగా జీవనాన్ని సాగిస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాలు సీఎస్ఆర్ అమలులో ఆదర్శంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతం అధికంగా ఉన్న తెలంగాణలోనూ సీఎస్ఆర్ అమలు కోసం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పొరుగు రాష్ట్రాల కార్యాచరణ తీరును అధ్యయనం చేస్తున్నది. ఒకవైపు అధ్యయన ప్రక్రియను కొనసాగిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో ఐటీడీఏల్లో అటవీ ప్రాంతాలు, ఆవాసాలకున్న అవకాశాలను పరిశీలిస్తున్నది. అయితే ఇప్పటి వరకు పరిశీలించిన నమునాలో తెలంగాణలో ఒడిశా నమునాను అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. దీనికోసం అధికారులను ఆ రాష్ట్రానికి పంపించే అవకాశాలు ఉన్నాయి.
అటవీశాఖతో సమన్వయం
కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ను తెలంగాణలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న గిరిజన సంక్షేమ శాఖకు అటవీ శాఖతో చిక్కులు తప్పడం లేదు. గతంలో ఉన్న ఆవాసాల పరిధి విస్తరణకు అటవీ శాఖ అంత త్వరగా నిర్ణయం తీసుకోదనే అభిప్రాయాలను గిరిజనశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖతో సమన్వయానికి రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి, అవసరమైతే అటవీ శాఖ అధికారుల నుంచి సహాయ, సహకారాలను సైతం తీసుకునేందుకు ప్రయత్నం చేయనున్నట్టు గిరిజన శాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ పూర్తిగా సహకరిస్తేనే సీఎస్ఆర్ తెలంగాణలో విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. ఆ శాఖతో సమన్వయం కోసం త్వరలోనే సమావేశాలను ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.
రెవెన్యూ శాఖతో మ్యాపింగ్
సీఎస్ఆర్ అమలుకు అటవీశాఖతోపాటు రెవెన్యూ శాఖ సైతం కీలకంగా వ్యవహరించనుంది. గతంలో ఉన్న రెవెన్యూ శాఖ రికార్డులకు అనుగుణంగా మ్యాపింగ్ చేసేవిధంగా చర్యలు వేగవంతం చేశారు. తద్వారా కొత్త ఆవాసాల పరిధి విస్తరణకు అవకాశం ఉంటుందన్నారు. ఉన్న ఆవాసాల పరిధిని సైతం విస్తరించేందుకు మెరుగైన అవకాశాలు ఉంటాయని గిరిజన శాఖ భావిస్తున్నది. సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వేగంగా రెవెన్యూ మ్యాపింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే విధంగా గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపడుతున్నది. సీఎస్ఆర్ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో దీనిపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వగా, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడంతో తదుపరి చర్యల్లో వేగం పెంచినట్టు గిరిజన శాఖ అధికారులు తెలిపారు.