TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు

by GSrikanth |
TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్​అధికారులు TSPSC బోర్డు వర్గాలపై సీరియస్​అయ్యారు. నోటీసులు ఇచ్చినా సరైన సమాచారాన్ని ఇవ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు సహకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాన్ఫిడెన్షియల్ రూం ఇన్‌ఛార్జీ శంకర్​లక్ష్మికి సంబంధించి కీలక వివరాలను సేకరించిన సిట్​అధికారులు ఆ తరువాత ఈ విధంగా స్పందించటం గమనార్హం. ఇక, ఈ కేసులో మూడో నిందితురాలిగా ఉన్న రేణుకను విచారణకు రావాల్సిందిగా సిట్​అధికారులు నోటీసులు జారీ చేశారు. టీపీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ రాష్ర్టవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోర్డు ఛైర్మన్, సెక్రటరీతోపాటు కాన్ఫిడెన్షియల్​రూం ఇన్‌ఛార్జీ శంకర్​లక్ష్మిని కూడా సిట్​అధికారులు విచారించారు.

అయితే, లీకేజీలో తన పాత్ర లేదని శంకర్​లక్ష్మి విచారణలో చెప్పారు. కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రవీణ్​తన డైరీ నుంచి పాస్​వర్డులు, ఐపీ అడ్రసులు తస్కరించినట్టు చెప్పిన మాటల్లో నిజం లేదని శంకర్​లక్ష్మి దర్యాప్తులో సిట్​అధికారులకు తెలిపారు. అయితే, శంకర్​లక్ష్మికి సంబంధించిన మొబైల్​ఫోన్​కాల్​డేటాను సేకరించి జరిపిన విశ్లేషణలో లీకేజీ వ్యవహారంలో ఆమెకు కూడా పాత్ర ఉన్నట్టుగా సిట్​అధికారులు గుర్తించినట్టు తెలిసింది. దాంతోపాటు డీఏఓ, ఏఈఈ సివిల్, జనరల్​స్టడీస్​ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బోర్డు అధికారులు పలు వివరాలను గోప్యంగా పెట్టినట్టు సిట్​అధికారులు తాజాగా గుర్తించినట్టు తెలిసింది. పేపర్లు వాల్యూయేషన్​చేయలేదని తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలుసుకున్న సిట్​అధికారులు బోర్డువర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

గంభీరాం రాహుల్​ ఎవరు?

ఇక, లీకేజీ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రవీణ్​కుమార్​స్నేహితురాలు, గురుకుల టీచర్​అయిన రేణుకకు సంబంధించి కూడా సిట్​అధికారులు కీలక వివరాలను తెలుసుకున్నారు. ప్రవీణ్​నుంచి రేణుక గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని తీసుకుని దానిని గంభీరాం రాహుల్​అనే వ్యక్తికి ఇచ్చినట్టు సిట్​విచారణలో తేలినట్టు సమాచారం. గంభీరాం రాహుల్​హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కాదని వెల్లడైనట్టు తెలిసింది. రేణుక తన సొంత కారులో గంభీరాం రాహుల్‌ను హైదరాబాద్​తీసుకొచ్చి ఓ హోటల్‌లో రూం బుక్​చేసి రహస్యంగా అతన్ని గ్రూప్-1 పరీక్షకు ప్రిపేర్​చేసినట్టుగా సిట్​దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలంటూ సిట్​అధికారులు తాజాగా రేణుకకు నోటీసులు జారీ చేశారు. గంభీరాం రాహుల్​గురించి ఆమెను నిశితంగా విచారించనున్నట్టు సమాచారం. ఇక, టీఎస్పీఎస్సీ బోర్డు వివరాల కోసం సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని సిట్​అధికారులు తెలిపారు.

Advertisement

Next Story