రైతు సంఘం ఎన్నికలకు కోట్లు.. అయినా కేసీఆర్‌ ఫ్లాప్ : విజయశాంతి

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-04 06:24:02.0  )
రైతు సంఘం ఎన్నికలకు కోట్లు.. అయినా కేసీఆర్‌ ఫ్లాప్ : విజయశాంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పేరు చెబితేనే మిగతా రాష్ట్రాల రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సీఎం కేసీఆర్ పై ఆమె ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. మహారాష్ట్రలో ఒక చిన్న రైతు సంఘం ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు పంచారని ఆరోపించారు. అయినా ఒక్క స్థానం కూడా గెలవలేదన్నారు. ఇతర పార్టీలు సైతం డబ్బులు పంచేలా బీఆర్ఎస్ తీరు ఉందని మండిపడ్డారు. రేపటి రోజు దేశమంతా ఇదే భ్రష్టాచార వ్యవస్థను బీఆర్ఎస్ అమలు చేస్తుందా అన్నారు.

తెలంగాణలో దోపిడీ చెయ్యబడ్డ లక్షల కోట్ల అవినీతి ధనంతో దేశంలోని అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు మేమే భరిస్తామని సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే అవహేళన చేసి, నియంతృత్వ ఫ్యూడల్ ధోరణికి ఇది నిదర్శనమన్నారు. ఏపీలో కూడా జనసేన లాంటి పోరాడే పార్టీని కూడా వెయ్యి కోట్ల ప్రలోభంతో (జనసేన అసహ్యించుకుని స్పందించనప్పటికీ...) మోసగించి దెబ్బ తియ్యాలనే కేసీఆర్ ప్రయత్నం ఆయా పత్రికల్లో వార్తలుగా వచ్చిందని ఆరోపించారు. ఇక అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే స్ఫూర్తితో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కేసీఆర్, బీఆర్ఎస్ తో స్వేహం, లిక్కర్ స్కాం ఆరోపణలతో నాశనమయ్యేట్లు అనిపిస్తున్నదన్నారు. ‘నేటి.. రేపటి నిజం’ ఇదే అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed