CPI: మహిళల పోస్టుల సంఖ్య పెంచాలి.. ఏఎన్ఎంల ధర్నాలో చాడ వెంకట్ రెడ్డి

by Ramesh Goud |
CPI: మహిళల పోస్టుల సంఖ్య పెంచాలి.. ఏఎన్ఎంల ధర్నాలో చాడ వెంకట్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ పరీక్ష నోటిఫికేషన్ లో మహిళలకు పోస్టులు పెంచాలని, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసన సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఎన్ ఏంలతో కలిసి కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ల పోస్టులు పెంచడంతో పాటు పరీక్షకు అర్హతలేని వారికి రూ. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, వందశాతం గ్రాస్ వేతనాలను ఇవ్వాలన్నారు. రెండు దశాబ్దాలుగా వీరితో పని చేయించుకున్న ప్రభుత్వాలు చివరికి రిటైర్మెంట్ సమయంలో ఖాలీ చేతులతో పంపించాలనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.

నూతన ఆర్థిక విధానాలతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పేర్లతో ఉద్యోగాల్లో కోతలు విధిస్తూ.. ఉన్న ఉద్యోగులకు అరకోర జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ఉద్యోగాలను వదులుకోలేక మరోవైపు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారన్నారు. 2021లో పీఆర్సీ అమలులోకి వస్తే ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడం అధికారుల లోపమేనని ఆరోపించారు. గత ప్రభుత్వంలో రెండో ఏఎన్ఎంలుగా ఉన్న తమను రెగ్యూలర్ చేయాలని పోరాటాలు చేశారని, కానీ అది సాధ్యం కాదని అప్పటి ప్రభుత్వం చెప్పిన కారణంగా వందశాతం గ్రాస్ శాలరీనైనా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు.

కార్మిక నాయకులతో జరిగిన చర్చల్లో గ్రాస్ శాలరీ అమలు కోసం త్రిసభ్య కమిటీని వేశారని, కానీ ఇప్పటి వరకు ఈ కమిటీ సూచనలు అమలు చేయలేదన్నారు. ప్రజాప్రభుత్వమైన వీరి సమస్యలను పరిష్కరించి వందశాతం గ్రాస్ వేతనాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్, ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జక్కుల పద్మ, బోయిని శ్యామల, ఉపాధ్యక్షులు పి .జయమ్మ, శీలం నాగ శేషమ్మ, సుమతి, గోపక్క, రాణి, సంధ్యా రాణి, సరోజిని, సహాయ కార్యదర్శిలు తన్వీరు సుల్తానా , రత్నకుమారి , రజిత, రాజేశ్వరి, స్కైలాబ్ రాణి, కృష్ణవేణి , లత, పార్వతి, రాష్ట్ర నాయకురాలు గుణవతి, స్వరాజ్య లక్ష్మి, గిరిజా రెడ్డి ,దేవయాని, హుస్సేన్ భీ, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed