జీవో 59 క్రింద ఇండ్ల క్రమబద్దీకరణ రుసుము తగ్గించాలి.. Kunamneni Sambasiva Rao

by Javid Pasha |
జీవో 59 క్రింద ఇండ్ల క్రమబద్దీకరణ రుసుము తగ్గించాలి.. Kunamneni Sambasiva Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీవో 59 క్రింద పేద, మధ్యతరగతి వర్గాలకు నామమాత్రపు ధరకే నివాస స్థలాలను క్రమబద్దీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ జోవో క్రింద క్రమబద్దీకరణ రుసుంను ప్రస్తుత మార్కెట్‌ ధర ఆధారంగా నిర్ణయించడంతో చెల్లించాల్సిన మొత్తం కొన్ని చోట్ల పదుల లక్షలలో ఉన్నదని అన్నారు. దీంతో జీవో 59 క్రింద తమ ఇంటి స్థలాలను క్రమబద్దీకరించుకోవలనుకున్న చాలా మంది ఆశలు అడియాశలు అయ్యాయని, ఆ మొత్తాన్ని కట్టలేక పోతున్నారని తెలిపారు. నిర్ణీత తేదీలోగా క్రమబద్దీకరణ రుసుమును చెల్లించకపోవడంతో రెవెన్యూ యంత్రాంగం ఆ ఇండ్లను కూల్చివేసేందుకు పూనుకుంటుందని అన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌`మల్కాజ్‌గిరి జిల్లాలలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. పేద ప్రజల ఎదుర్కొంటున్న ఈ సమస్యపై తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకొని ఇండ్ల కూల్చివేతను నిలిపివేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ జీవో 59 క్రింద దరఖాస్తు చేసుకున్న బీపీఎల్ వర్గాల వారికి జీవో 59 క్రింద ఉచితంగా క్రమబద్దీకరించేందుకు అవకాశం కల్పించాలని అయన సూచించారు.

Next Story

Most Viewed