బతుకమ్మ చీరలపై CPI ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
బతుకమ్మ చీరలపై CPI ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో చేనేత కార్మికులకు చేస్తున్న దీక్షకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరలు వచ్చాక సిరిసిల్లలో ఉన్న పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ పక్క రాష్ట్రాలకు తరలిపోయిందని గుర్తుచేశారు. కార్పొరేట్ కంపెనీలు వచ్చాక నేతలు పోటీ పడలేకపోతున్నారని అన్నారు. బతుకమ్మ చీరల పేరుపై కాకుండా వేరే పేరు పెట్టి ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వాలని సూచించారు. ఈ మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లు పేద ప్రజలకు అందని ద్రాక్షలా ఉన్నాయని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా పన్నులు రద్దు చేస్తూ రూ.లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడాన్ని తప్పుబట్టారు, కానీ పేదలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేద ప్రజలకు పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా మేలు జరిగే విధంగా ఉండాలన్నారు. పేద ప్రజలకు ముఖ్యంగా ఉచిత విద్య, వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

Advertisement

Next Story