Court rejects bail : మణికొండ జలమండలి మేనేజర్‌ స్పూర్తిరెడ్డికి బెయిల్ నిరాకరణ

by Ramesh N |
Court rejects bail : మణికొండ జలమండలి మేనేజర్‌ స్పూర్తిరెడ్డికి బెయిల్ నిరాకరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వలలో చిక్కన హైదరాబాద్‌లోని మణికొండ జలమండలి మేనేజర్‌ స్పూర్తిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది. ఆగస్ట్ 21న నల్లా కనెక్షన్‌ కోసం మేనేజర్‌ స్పూర్తిరెడ్డి, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌గౌడ్‌‌ను రూ.30వేలు లంచం తీసుకుంటుండగా హైదరాబాద్ సిటీ రేంజ్-2 యూనిట్ ఏసీబీకి పట్టుబడ్డారు. అయితే, మేనేజర్ స్పూర్తి తాను నిర్దోషిని అంటూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టులో వాదనలు జరిగాయి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో తన కుమార్తె బాధపడుతుండటంతో ఆమె బెయిల్ కోరారు.

అయితే, ఏసీబీ తరపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండటం.. ఇంకా చాలా మంది సాక్షులను విచారించి, ముఖ్యమైన పత్రాలను సేకరించాల్సి ఉన్నదని కోర్టుకు తెలిపారు. మరోవైపు పిటిషనర్ బెయిల్‌పై విడుదల అయితే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్డి వివరిస్తూ.. ఇక్కడ పిటిషనర్ మైనర్ కుమార్తె ఆటిజం డిజార్డర్‌తో బాధపడుతోందని పిటిషనర్ వాదన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, దర్యాప్తు దశలో కేసు ఉన్న నేపథ్యంలో వాదనను పరిగణనలోకి తీసుకోలేమని స్పూర్తి రెడ్డికి బెయిల్ నిరాకరించారు.

కాగా, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ స్పూర్తిరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు వల వేసి పట్టుకున్నారు. అయితే, సోదాలకు వెళ్లే సమయంలో ఏసీబీ అధికారులకే స్పూర్తి చుక్కలు చూపించారు. దాదాపు రెండుగంటల పాటు తాను ఉంటున్న ఇంటి అడ్రస్‌ను చెప్పలేదు. తప్పుడు అడ్రస్‌లు చెబుతూ అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. చివరకు అధికారులు ఇంటి అడ్రస్‌ను తెలుసుకొని వెళ్లారు. అనంతరం సోదాలు నిర్వహించగా అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed