అవసరం మేరకు పత్తి విత్తనాలు సరఫరా చేయాలి: మంత్రి తుమ్మల

by Disha Web Desk 12 |
అవసరం మేరకు పత్తి విత్తనాలు సరఫరా చేయాలి: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వచ్చే వానాకాలం నాటికి రైతులకు అవసరమైన ప్రత్తి విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పత్తి విత్తనాల కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ లో 2024 సంవత్సరానికి సంబంధించి వివిధ పంటల సాగు వివరాలు విత్తన లభ్యత గురువారం వివిధ ప్రైవేటు కంపెనీ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వచ్చే వానాకాలంలో దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని, దానికిగాను 121.06 లక్షల ప్యాకెట్లు అవసరం ఉందని తెలిపారు. ఇందుకు తగ్గట్టు అన్ని ప్రైవేటు విత్తన కంపెనీలు వ్యవసాయ శాఖకు ఇంతకు ముందే సంవ్రదించిన ప్రణాళిక ప్రకారం ప్రత్తి విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో పత్తి రెండవ ప్రధాన పంటగా ఉందని, ఇతర ప్రధాన పంటలు పరిశీలిస్తే వరి 16,50,000 క్వింటాళ్ళు, మొక్కజొన్న 48,000 క్వింటాళ్ళు అవసరమని అంచనా వేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విత్తన కంపెనీలు భావించాలని కోరారు. ప్రస్తుతమున్న లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరమున్నదని, విత్తన సరఫరాలో పారదర్శకత, నాణ్యమైన విత్తన సరఫరా కోసం విత్తన కంపెనీ ప్రతినిధులు సూచించిన కొన్ని సూచనలను పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. ప్రత్తి విత్తనాలు కాకుండా మొక్కజొన్న , ఇతర విత్తనాల సరఫరాలో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.


Next Story

Most Viewed