‘దిశ’ విశ్వసనీయతను దెబ్బతీసే కుట్ర.. సైబర్‌ క్రైం పీఎస్‌లో యాజమాన్యం ఫిర్యాదు

by Shiva |
‘దిశ’ విశ్వసనీయతను దెబ్బతీసే కుట్ర.. సైబర్‌ క్రైం పీఎస్‌లో యాజమాన్యం ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘దిశ’ పేరును పోలివున్న ‘దశ’ పేరుతో ఫేక్ వార్తల క్లిప్పింగులను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘దిశ’ పత్రికా ప్రతినిధులు బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. పత్రిక బ్యూరో చీఫ్ ఎన్ శ్రీనివాసరెడ్డి, తదితరులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు కాపీతో పాటు సాక్ష్యాధారాలను అందజేశారు. ఈ మేరకు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు.

ఆధారాలతో సహా..

‘దిశ’ పత్రిక పేరును పోలిన ‘దశ’ లోగోతో రాష్ర్ట ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై తమ పత్రికలో ప్రచురితం కాని వార్తలను క్లిప్పులుగా చేసి ఎక్స్‌లో, వాట్సాప్‌లో పోస్ట్ చేస్తున్న వారిపై కఠినచర్యలు చేపట్టాలని ‘దిశ’ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్లిప్పుల వెనకాల ఎవరున్నారో విచారించినప్పుడు లభించిన ఆధారాలను ఆ ఫిర్యాదుతో జతపర్చింది. ‘బీజేపీ ఏజెంట్ రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తాం - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు’ అనే శీర్షికతో తప్పడు కథనాన్ని మార్చి 8న ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదే విధంగా గతంలో ‘ఛోటే భాయ్ రేవంత్‌‌కు షాకిచ్చిన బడే భాయ్’, ‘రైతుల మీద రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు’, ‘అనుముల కుటుంబ ఖాతాలో అనుమానాస్పద హత్యలు ఎన్నో’, ‘కలెక్టర్.. కేర్ ఆఫ్ కాంట్రవర్సీ’ వంటి కథనాలతో ఫేక్ క్లిప్పులను పోస్ట్ చేశారని తెలుపుతూ.. లింకులను, స్క్రీన్ షాట్‌లను అందజేశారు.

పత్రిక ప్రతిష్టకు భంగం కలిగితే సహించబోం : ఎడిటర్ దూడం మార్కండేయ

‘దిశ’ ప్రతిక ప్రతిష్టకు భంగం కలిగితే సహించేది లేదని పత్రిక ఎడిటర్ దూడం మార్కండేయ హెచ్చరించారు. ‘దిశ’ విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే, వాళ్లు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వారి ఆదరణ పొందుతోన్న ‘దిశ’ వ్యూయర్‌ఫిప్‌లో శరవేగంగా దూసుకుపోతోందని, గత శుక్రవారం 5వ వార్షికోత్సవం జరుపుకుందని వివరించారు. ఈ ఆదరణను సహించలేని కొన్ని శక్తులే ఇలాంటి దుశ్చర్యలకు పూనుకుంటున్నాయని ఆరోపించారు. తాము చెప్పాలనుకున్న విషయాలు నిజమే అయితే, చట్టపరంగా పేపర్‌ పెట్టుకుని అందులో రాసుకోవచ్చని, ‘దశ’ పేరుతో ‘దిశ’ను బద్నాం చేయడం ఎందుకని ప్రశ్నించారు.

Next Story