- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వర్గీకరణనను అడ్డుకునే కుట్రలు సాగవు.. మంత్రి దామోదర రాజనర్సింహ

దిశ, తెలంగాణ బ్యూరో: మాదిగల సమష్టి కృషి, సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, సీఎం రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్ వల్లే వర్గీకరణ సాధ్యమవుతున్నదని.. ఆ వర్గీకరణను అడ్డుకునే కుట్రలు సాగవని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంత్రి రాజనర్సింహను హైదరాబాద్‌లోని తన నివాసంలో మాదిగ, మాదిగ ఉప కులాల నాయకులు, ప్రజలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తాను బట్టేబాజ్ మాటలు మాట్లాడి జాతిని మోసం చేసే వాడిని కాదని.. ఎవరికీ భయపడేది లేదని పేర్కొన్నారు. వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో 14 ఏండ్లు పెండింగ్‌లో ఉన్నదని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని ఎన్నికలకు ముందే చెప్పామని తెలిపారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే స్వయంగా చేవెళ్ల డిక్లరేషన్‌లో వర్గీకరణపై ప్రకటన చేశారని.. వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రితో అసెంబ్లీలో ప్రకటన చేయించామని వెల్లడించారు. ఇప్పటికే ఆలస్యమైందని.. ఇంకా అన్యాయం జరగొద్దన్న సదుద్దేశంతో వేగంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కోర్టు కేసులు, లీగల్ సమస్యలు రాకుండా వర్గీకరణను ముందుకు తీసుకెళ్లామని.. వర్గీకరణ జరగడం ఇష్టంలేని వ్యక్తులు, వర్గీకరణ పేరిట మనుగడ సాగించాలనుకునే వ్యక్తులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన మాల, మాదిగల మధ్య చిక్కులు సృష్టించి వర్గీకరణను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. వాళ్లను లీగల్‌గా ఎలా ఎదుర్కోవాలో, దశాబ్దాల వర్గీకరణ ఆకాంక్షను ఎలా నెరవేర్చాలో తము తెలుసన్నారు. మాదిగలు ఇంకా డప్పులు కొట్టేకాన్నే ఆగిపోవద్దని.. కంప్యూటర్లు పట్టి కోడింగ్ కొట్టాలని.. అమెరికా పోవాలని.. ఆఫీసర్లు కావాలని.. వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు.