బై ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ఖాళీ.. MP Arvind ఆసక్తికర వ్యాఖ్యలు

by Javid Pasha |   ( Updated:2022-08-25 10:05:09.0  )
బై ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ఖాళీ.. MP Arvind ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి వెంకట్ రెడ్డి బీజేపీలో ఉంటారేమో? అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చడంలో భాగంగానే బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్‌లను తొలగించాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ వారిని తొలగించకుంటే ఏం చేస్తాననే విషయాన్ని వెల్లడించలేదని అన్నారు.

ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే వచ్చే ఏడాది నాటికి వెంకట్ రెడ్డి బీజేపీలో ఉంటారేమో? అన్నారు. తెలంగాణలో పార్టీని కాపాడటంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని.. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ గుడ్ ఫ్రస్ట్రేటేడ్ ఫ్రెండ్ అన్నారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయిందని, క్రమంగా దక్షిణ తెలంగాణలోనూ కనుమరుగు అవుతోందన్నారు. పోలవరం విషయంలో కేంద్రం మీటింగ్ పెడితే ఒకసారి కేసీఆర్, మరోసారి జగన్ వెళ్లరు.. ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు. షర్మిల తెలంగాణలో కష్టపడుతున్నారని ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతి సారి ప్రైవేట్ విమానాల్లో ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చింది.

ఒబేరాయ్ హోటల్‌లో లాబీయింగ్ ఏంటనే విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ నేతలు గమనించారని చెప్పారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఆమెపై ఉందన్నారు.ఈ అంశంలో విమర్శలకు సమాధానాలు చెప్పకుండా కోర్టును ఆశ్రయించడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాన్నారు. అమిత్ షా సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్లి చాయ్ తాగారని అలాగే జూ.ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని అయితే మీడియా మాత్రం జూ.ఎన్టీఆర్ పైనే ఫోకస్ చేసిందన్నారు.

పవన్ కత్యాణ్‌తో తమ స్నేహం కొనసాగుతోందని చెప్పారు. ఏపీలో వైసీపీ, టీడీపీలను ప్రత్యర్థులుగానే చూస్తామని చెప్పారు. ఇక్కడ బీజేపీని పెంపొందించుకునేందుకు ప్రయత్నం కొనసాగించాల్సిందేన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలోనూ ఖాళీ అవుతుందని అన్నారు. ఏపీ రాజధాని విషయంలో వైసీపీ నేతలే అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకున్నారని, ఎన్నికల నాటికి ఆ నిందను బీజేపీపై మోపే ప్రయత్నం చేస్తారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed