జగన్ కోసమే కేసీఆర్ రాజీ.. తెలంగాణ పొట్టకొట్టి ఏపీకి ధారాదత్తం

by GSrikanth |   ( Updated:2024-02-11 17:15:17.0  )
జగన్ కోసమే కేసీఆర్ రాజీ.. తెలంగాణ పొట్టకొట్టి ఏపీకి ధారాదత్తం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణ జలాల విషయంలో, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించినట్లు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆ ఆరోపణలను తిప్పికొట్టడానికి సిద్ధమవుతున్నది. పదేండ్ల పాలనలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు చేసిన అన్యాయం, న్యాయంగా తెలంగాణ వాడుకోవాల్సిన వాటాను వదులుకోవడం, ఆంధ్రప్రదేశ్‌కు నీటిని ధారాదత్తం చేయడం, హక్కుల్ని సాధించుకోడానికి బదలు రాజీ పడి ఆ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకోవడం, బోర్డుకు ప్రాజెక్టుల్ని అప్పగించేందుకు సిద్ధం కావడం.. ఇలాంటి అనేక అంశాలను ఆధారాలతో సహా వెల్లడించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అసెంబ్లీ వేదికగానే శ్వేతపత్రాల రూపంలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది.

బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా భవన్‌లో ఆదివారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సాగునీటిపారుదల శాఖ అధికారులూ అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబీ సమావేశాల్లో గత ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై వివరించారు. దక్షిణ తెలంగాణకు జీవనాడిగా ఉన్న కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ రాజీపడడమే కాకుండా ఆ రాష్ట్ర సీఎంతో కుమ్మక్కై నీటిని ధారాదత్తం చేశారని, తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారని, రాయలసీమను రతనాల సీమగా చేస్తానంటూ ఓపెన్‌గానే చెప్పారని ఆడియో, వీడియోతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా డిప్యూటీ సీఎం, మంత్రులు హాజరయ్యారు.

శ్వేతపత్రాలను సోమవారమే అసెంబ్లీ, కౌన్సిల్‌లో సమర్పించేలా ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో వీటిపై చర్చలు జరిగేలా, బీఆర్ఎస్ నేతల గత పాపాలను కడిగేసేలా, అప్పటి సీఎంగా కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు అర్థం చేయించేలా అన్ని వివరాలనూ ఈ వర్క్ షాపులో మంత్రి, అధికారులు, నిపుణులు వివరించారని అందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియాకు వివరించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకూ మంత్రి, అధికారులు వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమతమ ప్రాంతాలకు జరిగిన అన్యాయంపై స్పష్టత వచ్చిందని, వాటిని అసెంబ్లీ, కౌన్సిల్‌లో జరిగే చర్చల్లో ఎండగడతామన్నారు.

ఇప్పటికే కృష్ణ జలాల వాటా, పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింత, కేఆర్ఎంబీ సమావేశాల్లో చేసిన నిర్ణయాలు తదితరాలపై కాంగ్రెస్, బీఅర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి టర్ములో ఐదేండ్ల పాటు హరీశ్‌రావు, రెండోసారి కేసీఆర్ సాగునీటిపారుదల శాఖ మంత్రులుగా వ్యవహరించారు. తెలంగాణకు జరిగిన ద్రోహంలో వీరిద్దరూ భాగస్వాములంటూ గత వారం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ ఆరోపించారు. ఇప్పటివరకు అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబీ సమావేశాలు ఎన్ని జరిగాయి, వాటిలో తెలంగాణ తరఫున వినిపించిన వాదనలేంటి, జరిగిన నిర్ణయమేంటి, కుదిరిన ఒప్పందాలేంటి.. తదితరాలన్నింటినీ అధికారులు ఈ వర్క్ షాపులో వివరించారు.

కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని వ్యాఖ్యానించిన కిసాన్ కాంగ్రెస్.. నల్లగొండలో ఈ నెల 13న ఆ పార్టీ నిర్వహించనున్న సభకు నిరసనగా కేసీఆర్ దిష్టబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. తప్పుచేసిన పార్టీయే అబద్ధపు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని కిసాన్ కాంగ్రెస్ ఆరోపించింది. తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లో ఎండగట్టేలా నల్లగొండ జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది.

జగన్‌తో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం : మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ

“ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో గత సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారు. తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఆ రాష్ట్రానికి ధారాదత్తం చేశారు. కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినదానికంటే ఎక్కువ అన్యాయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే జరిగింది. గత పాలకులకంటే కేసీఆరే ఎక్కువ అన్యాయం చేశారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్నదంతా దుష్ప్రచారమే. అసెంబ్లీ వేదికగానే గులాబీ నేతల వాదనలను తిప్పికొడతాం. వారు చెప్తున్నవన్నీ ఏ రకంగా అబద్ధాలో ప్రజలకు వివరిస్తాం. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారాన్నీ వివరిస్తాం. తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్, ఆయన కుటుంబం ఏ స్థాయిలో లూటీచేసిందో బట్టబయలు చేస్తాం”.

రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ ఆరాటం : ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్

“తెలంగాణకి ఉమ్మడి రాష్ట్ర పాలకుల కంటే కేసీఆరే ఎక్కువ అన్యాయం చేశారు. జగన్, కేసీఆర్ కలిసి పన్నిన కుట్రలో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున నాగార్జున సాగర్ ప్రాజెక్టుపైకి ఆ రాష్ట్ర పోలీసులు వచ్చారు. కేసీఆర్ ఇచ్చిన చనువు, కల్పించిన స్వేచ్ఛతోనే ఏపీ సీఎం జగన్ రెచ్చిపోయారు. తెలంగాణకు దక్కాల్సిన నీటిని దోచుకపోవడానికి ఆస్కారం ఇచ్చిందే కేసీఆర్. ఏపీ జలదోపిడీలో ఇద్దరూ దోషులు. ఇకనైనా ఏపీని కట్టడి చేయకుండా భవిష్యత్తులో దక్షిణ తెలంగాణా ఎడారిగా మారుతుంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధికోసమే కృష్ణా జలాల అంశాన్ని అబద్ధాల పునాదులపై కేసీఆర్ తెరపైకి తెచ్చారు. సెంటిమెంట్‌గా మార్చుకునేందుకు పోరాటం అనే పేరుతో డ్రామా మొదలు పెట్టారు”.

బీఆర్ఎస్ డ్రామాలను ఎక్స్ పోజ్ చేస్తాం : బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్

“కృష్ణా జలాలపై తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని అసెంబ్లీ వేదికగానే వివరిస్తాం. మేం లేవనెత్తే ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పుకుంటుందా?.. క్షమాపణ చెప్తుందా.. చూస్తాం. బీఆర్ఎస్ నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించనున్న సభలో కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడానికి ముందే మేం రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్తాం. స్వయంగా ఏపీ సీఎం జగనే వాళ్ళ అసెంబ్లీలో తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన సహకారాన్ని, నీటిని ఇవ్వడానికి అంగీకరించడాన్ని చెప్పారు. ఇంత ద్రోహం చేసిన కేసీఆర్‌ను తెలంగాణ జనం నమ్మరు. ఆయన అనుకుంటున్నట్లుగా లోక్‌సభ ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేయదు”.

Advertisement

Next Story

Most Viewed