కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్ష.. MP ఎన్నికల వేళ బిగ్ టాస్క్ అప్పగించిన హైకమాండ్..!

by Disha Web Desk 19 |
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్ష.. MP ఎన్నికల వేళ బిగ్ టాస్క్ అప్పగించిన హైకమాండ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సైతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తలపించేలా భారీ మెజారిటీ సాధించేందుకు కాంగ్రెస్ బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఎంపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు అప్పగించింది. బూత్ స్థాయి మొదలు ఎంపీ సెగ్మెంట్ వరకు పక్కా సమన్వయంతో కూడిన మెకానిజంను రూపొందించింది. నిన్నమొన్నటివరకూ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా ఉన్న పది మంది మంత్రులకు, సీనియర్ లీడర్లకు నిర్దిష్టమైన గెలుపు బాధ్యతను అప్పజెప్పినట్లుగానే అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా స్పెషల్ టాస్క్ అప్పగించింది. ఒక ఎంపీ సెగ్మెంట్‌లోని ఏడు అసెంబ్లీల పరిధిలో ఓట్ షేర్ పెంచడంపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. దీంతో ఇప్పటికే మొదలైన ఎమ్మెల్యేల ప్రచారం నామినేషన్ల తర్వాత మరింత ఊపందుకోనున్నది.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా హైదరాబాద్ వచ్చి మంత్రులతో, పార్టీ లీడర్లతో, అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. మిషన్-15 పేరుతో టాస్క్ అప్పగించారు. గెలవడానికి అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. దీన్ని సాకారం చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే పీసీసీ చీఫ్‌గా ఉండడంతో ఎమ్మెల్యేలకు, ఎంపీ సెగ్మెంట్ ఇన్‌చార్జిలుగా ఉన్న మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందే ఎంపీ సెగ్మెంట్ల వారీగా ఎమ్మెల్యేలు, లీడర్లతో రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ పార్టీ బలాబలాలను వివరించడంతో పాటు దిశానిర్దేశం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు దాని దూకుడును కట్టడి చేయడంపై దృష్టి పెట్టింది. ఆ పార్టీకి ఉన్న సంస్థాగత నిర్మాణం తరహాలోనే ఇప్పుడు అనుబంధ సంఘాలను సైతం కాంగ్రెస్ రంగంలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల బస్సు యాత్ర లాంటివి నిర్వహించగా.. ఇప్పుడు నేరుగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ, కిసాన్ సెల్, మహిళా విభాగం కార్యకర్తలను కూడా గ్రామాల్లోకి తరలించింది. ఇంటింటికీ తిరిగి వంద రోజుల పాలన, ఆరు గ్యారంటీల అమలు, జాతీయ స్థాయిలో రిలీజ్ చేసిన ‘న్యాయ్ పత్ర్’ అంశాలను వివరిస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు.. తదితర హామీలను జనంలోకి తీసుకెళ్ళే టాస్క్ అప్పగించింది.

నామినేషన్ల రోజునే బల ప్రదర్శన నిర్వహించిన పార్టీ నాయకత్వం రానున్న రోజుల్లో భారీ బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించి మౌత్ టాక్‌ను మరింత విస్తృతం చేసే దిశగా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. ఎంపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు వస్తాయనే ధీమా ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఒక వ్యూహం ప్రకారం అప్పజెప్పిన సీఎం రేవంత్.. ఫలితాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో అలాంటి అవకాశాలు ఇస్తామనే సంకేతాన్ని ఇచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed