'CM KCR శాసన సభ అనగానే భయపడుతున్నారా..?'

by samatah |   ( Updated:2022-09-13 06:33:43.0  )
CM KCR Announces New Pensions will be given from 15 August
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజాసమస్యలను ప్రస్తావించే అసెంబ్లీ సమావేశాలను కేవలం రెండు రోజుల్లోనే ముగించేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, పొడెం వీరయ్య మీడియాతో మాట్లాడారు. మేము 20 రోజులు సభ నడపాలని డిమాండ్ చేస్తే రెండు రోజులకే పరిమితం చేస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. రెండు రోజులే సభ నడపడాన్ని తీవ్రంగా ఖండించారు. తీవ్రమైన సమస్యలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పోడు భూములు, హోమ్ గార్డ్స్ సమస్యలు, 317 జీవో వల్ల సమస్యలు, వీఆర్ఏల సమస్యలు, హై స్కూల్స్ బస్‌పాస్‌లు, ధరణి, నిరుద్యోగ భృతి, లాంటి అంశాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కనీసం రెండు వారాల పాటు జరగాల్సిన శాసనసభ పనిదినాలు రెండు రోజులకే పరిమితం చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని శవపంచనామ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగి లేకుండా చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 17 తరువాత శాసనసభ నడపాలని డిమాండ్ చేశారు.

సీఎంను టైం అడిగాం..ఇస్తారా లేదా?.. చూడాలి

ప్రజల సమస్యలను పరిష్కరిద్దామంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతుంది ? అంటూ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు గళం విప్పే వేదిక అయిన అసెంబ్లీని కేవలం రెండు రోజుల్లో ముగించడాన్నా తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ ముట్టడులు రోజుకు ఎన్నో జరుగుతున్నా.. ప్రభుత్వం పరిష్కార మార్గం చూపడంలేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకు టీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారని శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలపై ప్రజలు ఎంతో ఆశతో చూస్తున్నారని తెలిపారు. ఎన్ని రోజులైనా నడుపుతాం అనే సీఎం, సభ నడిపేందుకు భయపడుతున్నారు? అంటూ విమర్శించారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అయితే ఎందుకు సభ నడపరు? అని నిలదీశారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. పోడు భూములపై ప్రభుత్వం ఇచ్చిన హామీలో స్పష్టత లేదని సీతక్క వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, నియోజకవర్గాల్లో సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం సీఎం కేసీఆర్‌ను టైం అడిగినట్లు తెలిపారు. మరి సీఎం కేసీఆర్ సమయం ఇస్తారా లేదా చూడాలి.. టైం ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో మాట్లాడే దైర్యం లేనివాళ్లని సీఎం అంటారా ?

మరోవైపు ఎమ్మేల్యే పొడెం వీరయ్య సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ అనగానే కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేనప్పుడు ముఖ్యమంత్రి అని ఎలా అనగలం అంటూ ప్రశ్నించారు. సీఎం నోరు తెరిస్తే బంగారు తెలంగాణ అంటారు, మరి చర్చ జరపడానికి ఎందుకు ముందుకు రారు? పోడు భూములపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చెయ్యాలని కోరారు. గోదావరి వరదల్లో సీఎం కేసీఆర్ తిరిగి కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం తప్పించుకుంటుందని.. సభలోనే మా వాడి వినిపిస్తాం అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడనివ్వకపోతే పోడియం ముందుకు వెళ్ళి మా వాడి వినిపిస్తాం.. అవసరమైతే అసెంబ్లీ స్తంభింపచేస్తాం అంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు.

Also Read : మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తోన్న వేళ.. కేసీఆర్‌కు బిగ్ షాక్

Advertisement

Next Story

Most Viewed