అధిష్టానం బుజ్జగింపులు సక్సెస్.. రేవంత్‌కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్‌?

by GSrikanth |
అధిష్టానం బుజ్జగింపులు సక్సెస్.. రేవంత్‌కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్‌?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్‌గాంధీ, మాణిక్‌రావ్ థాక్రే, డీకే శివకుమార్ సుమారు అరగంట పాటు చర్చించి పేర్లను ఫైనల్ చేశారు. ఆ సమావేశంలో రేవంత్‌ను సీఎం చేయడంపై నిర్ణయం జరిగినట్లు సూచనప్రాయంగా తెలిసింది. అదే విషయాన్ని సీల్డ్ కవర్‌లో పెట్టి హైదరాబాద్‌కు పంపుతున్నారు. సీఎల్పీ సమావేశంలోనే లాంఛనంగా పేర్లను వెల్లడి చేసేలా ఏఐసీసీ ప్లాన్ చేసింది. ఆ సీల్డ్ కవర్‌తో పాటు కేసీ వేణుగోపాల్, డీకే, థాక్రే తదితరులు స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో నగరానికి చేరుకోనున్నారు. సాయంత్రం అఫీషియల్‌గా పేర్లను ఆ సమావేశంలోనే వెల్లడించనున్నారు.

సీఎం పోస్టు కోసం ప్రయత్నించినవారిని హైకమాండ్ బుజ్జగించింది. ఖర్గే, రాహుల్, కేసీ, థాక్రే సమావేశానికి ముందే ఉత్తమ్, భట్టితో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను వారికి వివరించారు. సీఎల్పీ మీటింగ్‌లో సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను లాంఛనంగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు ముమ్మరం కానున్నది. ఉత్తమ్, భట్టి ఢిల్లీలోనే ఉండిపోయినప్పటికీ రేవంత్‌ మాత్రం ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్‌లోని హోటల్‌లోనే ఉండిపోయారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చేపట్టాల్సిన యాక్టివిటీస్‌ను ప్రయారిటీ బేసిస్‌లో పరస్పరం చర్చించుకున్నారు.

సీఎం, డిప్యూటీ సీఎం పోస్టుల విషయంలో ఉత్తమ్, భట్టి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు తగిన ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అవకాశాలు, ప్రయారిటీలు ఉంటాయని, వాటికి అనుగుణంగా సీనియర్ల సేవలను వినియోగించుకునే వీలు ఉంటుందని బుజ్జగించినట్లు తెలిసింది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని స్వయంగా ఉత్తమ్ చెప్పడంతో పాటు కట్టుబడి ఉంటానని కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో సీఎం, డిప్యూటీ సీఎం విషయంలో పెద్ద వివాదం కొలిక్కి వచ్చినట్లయింది. ముఖ్యమంత్రిగా రేవంత్, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలగిపోయినట్లయింది.

Advertisement

Next Story